కేరళలో వర్ష విలయం... 19 మంది మృతి
- కేరళలో అతి భారీ వర్షాలు
- పలు జిల్లాలు అతలాకుతలం
- విరిగిపడుతున్న కొండచరియలు
- పలు ప్రాంతాల్లో వరద పరిస్థితులు
- సీఎం విజయన్ ఉన్నతస్థాయి సమావేశం
కేరళలో నిన్నటి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండగా, మరికొన్ని ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య 19కి చేరింది. ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో వర్ష బీభత్సం అధికంగా ఉంది. ఒక్క కొట్టాయం జిల్లాలోనే 9 మంది మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబంలోని ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది.
రాష్ట్రంలో పరిస్థితులపై సీఎం పినరయి విజయన్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సహాయ చర్యల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా పాలుపంచుకుంటున్నాయి. ఇప్పటికే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఫ్ 11 బృందాలను మోహరించింది. ఎనిమిది మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు సహా 33 మందిని ఎన్టీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి.
గత రాత్రంతా కురిసిన వర్షం ఉదయానికి తగ్గుముఖం పట్టినా, అప్పటికే అనేక జిల్లాల్లో జనజీవనం స్తంభించింది.
గత రాత్రంతా కురిసిన వర్షం ఉదయానికి తగ్గుముఖం పట్టినా, అప్పటికే అనేక జిల్లాల్లో జనజీవనం స్తంభించింది.