కొందరి కుటిల నీతులతో రెండేళ్లకే పదవి కోల్పోయారు.. మాజీ సీఎంను స్మరించుకున్న పవన్​ కల్యాణ్​

  • దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారకం చేస్తామని ప్రకటన
  • రూ.కోటితో నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి
  • వంశధార, పులిచింతల ప్రాజెక్టులు ఆయన చలవేనని కామెంట్
  • హైదరాబాద్ అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్న పవన్
ఎల్లప్పుడూ స్మరించుకోదగిన వ్యక్తి దామోదరం సంజీవయ్య అని జనసేన అధిపతి పవన్ కల్యాణ్ అన్నారు. ఆయనందించిన సేవలకు గుర్తుగా ఆయన ఇంటిని స్మారక చిహ్నంగా మార్చేందుకు తలపెట్టామని, అందుకు రూ.కోటి నిధిని ఏర్పాటు చేస్తున్నామని ఆయన ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తొలి అణగారిన నేత దామోదరం సంజీవయ్య అని, కడు పేద కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా ఎదిగిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.


కొందరి కుటిల నీతుల వల్ల ఆయన రెండేళ్లకే పదవిని వదిలేయాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. అయితే, ఆ రెండేళ్ల కాలంలోనే ప్రజలకు ఎనలేని సేవలు చేశారని, ఎన్నెన్నో విజయాలు సాధించారని గుర్తు చేశారు. తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో వెనుకబాటుతనం రూపుమాపేందుకు బాటలు వేశారన్నారు. శ్రీకాకుళంలోని వంశధార ప్రాజెక్టు, రాయలసీమలో గాజులదిన్నె, వరదరాజులు ప్రాజెక్టులు ఆయన చలవేనన్నారు. కృష్ణా నదిపై పులిచింతల ప్రాజెక్టుకూ అంకురార్పణ చేసిందీ ఆయనేనని గుర్తు చేశారు.

హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో నిజాం నుంచి స్వాధీనం చేసుకున్న భూములలో 6 లక్షల ఎకరాలను దళితులు, వెనుకబడిన వర్గాలు, కార్మికులకు పంచిన మహోన్నత వ్యక్తి సంజీవయ్య అని పవన్ కొనియాడారు. కార్మికులకు బోనస్, చట్టాల సవరణకు లా కమిషన్, అవినీతి నిరోధక శాఖ, ఊరూరా పారిశ్రామికవాడలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, హైదరాబాద్–సికింద్రాబాద్ ను కలిపి మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు వంటివి చేసింది సంజీవయ్యేనన్నారు.


తల్లి చెప్పిన మాటలతో చలించిపోయి వృద్ధులు, వికలాంగులకు పింఛను పథకాన్ని ప్రారంభించింది కూడా ఆయనేనన్నారు. మాతృభాష తెలుగు అంటే సంజీవయ్యకు మక్కువ అని, అందుకే ప్రభుత్వ ఆలయాల్లో ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగులోనే జరిపించారని పవన్ గుర్తు చేశారు. అర్ధ శతాబ్దం కిందటే కులాల మధ్య సయోధ్యను సాధించారన్నారు. బోయలు, కాపు–తెలగ–బలిజ ఇతర అనుబంధ కాపు కులాలను వెనుకబడిన జాబితాలో చేర్చి వారి అభివృద్ధికి పాటుపడ్డారన్నారు.

అలాంటి గొప్ప వ్యక్తి జీవిత చరమాంకంలో అత్యంత సాధారణ జీవితం గడిపారని, ఆయన చనిపోయే నాటికి కేవలం రూ.17 వేలు, ఓ పాత ఫియట్ కారు మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. అదే ఇప్పటి నాయకులైతే ఎంత సంపాదించేవారో అర్థం చేసుకోవచ్చునని పవన్ వ్యాఖ్యానించారు.


More Telugu News