కాంగ్రెస్ పగ్గాలు చేపట్టే అంశం పరిశీలిస్తా: రాహుల్ గాంధీ

  • నేడు సీడబ్ల్యూసీ సమావేశం
  • హాజరైన ఏఐసీసీ సీనియర్లు
  • రాహుల్ మరోసారి అధ్యక్షుడిగా రావాలని ఆకాంక్ష
  • సిద్ధాంతాలపై సీనియర్ల నుంచి స్పష్టత కావాలన్న రాహుల్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మరోసారి రావాలన్న ఆకాంక్ష నేటి సీడబ్ల్యూసీ సమావేశంలో బలంగా వ్యక్తమైంది. ఏఐసీసీ సీనియర్ నాయకులు సైతం రాహుల్ నాయకత్వానికి మద్దతు పలికారు. అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ పేరును ప్రతిపాదించగా, ఇతర నేతలు సానుకూలంగా స్పందించారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ, కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలను మరోసారి చేపట్టే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటానని స్పష్టం చేశారు. అయితే పార్టీ సైద్ధాంతిక భావజాలంపై సీనియర్ల నుంచి స్పష్టత రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

కాగా, పలువురు నేతలు స్పందిస్తూ, ఎన్నికల వరకు రాహుల్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని సూచించారు. అటు, పార్టీకి తానే పూర్తిస్థాయి అధినేత్రినని, తాత్కాలిక అధ్యక్షురాలిగా చూడొద్దని సోనియా గాంధీ స్పష్టం చేయడం తెలిసిందే.

ఇక, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి 2022 ఏప్రిల్ లో నామినేషన్లు స్వీకరించనున్నారు. 2022 ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 21 వరకు సీడబ్ల్యూసీ సభ్యుల ఎన్నిక జరగనుంది. 2022 అక్టోబరు 31 నాటికి పార్టీకి కొత్త ప్రెసిడెంట్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు.


More Telugu News