వాళ్లకు అభినందనలు ఎందుకు చెప్పలేదు?: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై డేల్ స్టెయిన్ ఆగ్రహం

  • చెన్నై జట్టులో ముగ్గురు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు
  • డుప్లెసిస్, తాహిర్, ఎంగిడి ప్రాతినిధ్యం
  • కేవలం ఎంగిడిని అభినందించిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు
  • డుప్లెసిస్, తాహిర్ లను కూడా అభినందించాలన్న స్టెయిన్
ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్ 14వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్ తమ దేశ క్రికెట్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ విజేత చెన్నై జట్టులో దక్షిణాఫ్రికన్లు ఫాఫ్ డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్, లుంగీ ఎంగిడి కూడా ఉన్నారు. అయితే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కేవలం ఎంగిడికి మాత్రం అభినందనలు తెలిపింది. దాంతో స్టెయిన్ తీవ్రంగా స్పందించాడు.

డుప్లెసిస్, తాహిర్ లకు ఎందుకు అభినందనలు తెలుపలేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. మాజీ కెప్టెన్ డుప్లెసిస్, తాహిర్ లను కూడా దక్షిణాఫ్రికా బోర్డు అభినందించాలని, వారిద్దరూ అర్హులు కాదా? అని నిలదీశాడు. అయితే తమ దేశ బోర్డు ఎంగిడిని అభినందిస్తూ చేసిన సోషల్ మీడియా పోస్టులకు కామెంట్స్ సెక్షన్ ను బ్లాక్ చేసిందని స్టెయిన్ ఆరోపించాడు.

ఇక, ఇతర మాజీ క్రికెటర్లు కూడా ఇదే విధంగా అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తీరు దిగ్భ్రాంతి కలిగించిందని, ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆటగాళ్లకు తగిన గౌరవం ఇవ్వాలని బోర్డుకు హితవు పలికారు.


More Telugu News