గుండెపోటుతో చనిపోయిన సౌరాష్ట్ర యువ క్రికెటర్

  • సౌరాష్ట్ర బ్యాట్స్ మన్ అవి బరూత్ మృతి
  • ఆసుపత్రికి తరలించేలోగానే విషాదం
  • అతడి భార్య నాలుగు నెలల గర్భవతి
  • 42 ఏళ్ల వయసులోనే చనిపోయన అతని తండ్రి
గుండెపోటుతో యువ క్రికెటర్ కన్నుమూశాడు. సౌరాష్ట్ర బ్యాట్స్ మన్ అవి బరూత్ (29) నిన్న సాయంత్రం మరణించాడని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. బరూత్ మరి లేడన్న విషయం తెలిసి గుండె బరువెక్కిందని ఆవేదన వ్యక్తం చేసింది. అతని మరణం షాక్ కు గురి చేసిందని పేర్కొంది. అవిని మిస్ అవుతున్నామని విచారం వ్యక్తం చేసింది. అవికి తల్లి, భార్య ఉన్నారు. ప్రస్తుతం అతని భార్య గర్భవతిగా ఉండడం మరింత కలిచివేసే విషయం.

ఒంట్లో కొంత నలతగా అనిపించడంతో వెంటనే అహ్మదాబాద్ లోని తన ఇంటి నుంచి అంబులెన్సులో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారని, మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచాడని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జయదేవ్ షా చెప్పారు. గతంలో 42 ఏళ్ల వయసులోనే అవి తండ్రి చనిపోయారని, అవి భార్య ఇప్పుడు నాలుగు నెలల గర్భవతి అని తెలిపారు.

హర్యానా, గుజరాత్ నుంచి అతడు ప్రాతినిధ్యం వహించాడు. 2011లో ఇండియా అండర్ 19 కెప్టెన్ గా అతడు వ్యవహరించాడు. 2019–2020 సీజన్ లో రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడు. 38 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు, 38 లిస్ట్ ఏ మ్యాచ్ లు, 20 దేశవాళీ టీ20లు ఆడాడు.

వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అయిన అవి.. ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో మొత్తం 1,547 పరుగులు చేశాడు. లిస్ట్ ఏలో 1,030, టీ20ల్లో 717 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా గోవాతో మ్యాచ్ లో 53 బంతుల్లోనే 122 పరుగులు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు.


More Telugu News