పార్టీకి ఫుల్ టైం అధ్యక్షురాలిని నేనే: సీడబ్ల్యూసీ మీటింగ్ లో స్పష్టం చేసిన సోనియా గాంధీ

  • జీ23 లీడర్లకు పరోక్ష హెచ్చరికలు
  • తనతో నేరుగా మాట్లాడొచ్చని వ్యాఖ్య
  • మీడియా అక్కర్లేదని వెల్లడి
  • యువ నేతలు బాగా పనిచేస్తున్నారని కామెంట్
  • కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపాటు
ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి ఫుల్ టైం చీఫ్ అంటూ ఎవరూ లేరు. ఇన్నాళ్లూ సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అయితే, తాజాగా వాటన్నింటికీ సోనియా చెక్ పెట్టేశారు. పార్టీకి తానే ఫుల్ టైం అధ్యక్షురాలినని ఆమె స్పష్టం చేశారు. ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పార్టీ నేతలకు ఆమె ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. మీటింగ్ తర్వాత దీనిపై ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు. పరోక్షంగా ‘జీ23’ నేతలకు ఓ హెచ్చరికలా స్పష్టతనిచ్చారు. పార్టీ నిర్మాణం, పోరాటాల్లో యువ నేతలు చాలా కీలకంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.

వ్యవసాయ చట్టాలు, కరోనా పరిహారం, దళితులపై దాడులు, ప్రజా సమస్యలపై యువనేతలు బాగా పోరాడుతున్నారని, ఏదైనా సవాల్ గా తీసుకుంటున్నారని ఆమె కొనియాడారు. జీ23 నేతలనుద్దేశించి తనతో ఎవరైనా నేరుగా మాట్లాడవచ్చని, మీడియా ద్వారా తెలియజేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఎవరైనా స్వేచ్ఛగా, నిజాయతీగా చర్చించవచ్చని తెలిపారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని భ్రష్టుపట్టిస్తోందని సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మరింత గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు ఉద్యమం చేబట్టి ఏడాది దాటినా, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతున్నా బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి అన్నింటినీ అమ్మడమే పరిష్కారమని బీజేపీ భావిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ లో మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయని, ఈ రెండేళ్లలో మైనారిటీల హత్యలు పెరిగాయని ఆమె అన్నారు.


More Telugu News