మ‌ళ్లీ క్రియాశీల రాజ‌కీయాల్లోకి శ‌శిక‌ళ‌?

  • తనను ఏ శక్తీ అడ్డుకోలేదని ఇటీవ‌లే ప్ర‌క‌ట‌న
  • అన్నాడీఎంకే అధికార పత్రిక నమదు ఎంజీఆర్‌లో కీల‌క వ్యాఖ్య‌లు
  • నేటితో అన్నాడీఎంకే స్థాపించి 50 ఏళ్లు
అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శ‌శిక‌ళ త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లోకి మ‌ళ్లీ ఎంట్రీ ఇచ్చి, కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. జ‌య‌ల‌లిత బాట‌లోనే వెళ్తానంటూ ఇటీవ‌ల శ‌శికళ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తనను ఏ శక్తీ అడ్డుకోలేదని అన్నాడీఎంకే అధికార పత్రిక నమదు ఎంజీఆర్‌లో పార్టీ శ్రేణుల‌ను ఉద్దేశించి ఇటీవ‌లే ఆమె ఓ ఆర్టిక‌ల్ రాశారు.

చెప్పిన‌ట్లుగానే ఆమె అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఈ రోజు మెరీనాబీచ్ కు వెళ్లి మాజీ ముఖ్య‌మంత్రులు జ‌య‌ల‌లిత‌, ఎంజీ రామ‌చంద్ర‌న్‌, సీఎన్ అన్నాదురై స‌మాధుల‌ను ఆమె సంద‌ర్శించి, నివాళుల‌ర్పించ‌నున్నారు.

నేటితో అన్నాడీఎంకే స్థాపించి 50 ఏళ్లు పూర్త‌వుతాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే స్వ‌ర్ణోత్స‌వాలు జ‌రుపుకుంటోంది. ఈ సందర్భంలోనే ఆమె తిరిగి రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేయ‌బోతున్నారని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. పార్టీలో బ‌లం పెంచుకునేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకున్నారని అంటున్నారు.

ఇందులో భాగంగానే నమదు ఎంజీఆర్‌ పత్రిక ద్వారా ఆమె రోజుకో ప్రకటన చేస్తున్నారు. అన్నాడీఎంకే అందరిదీ అని, పార్టీలో అందరూ సమానమేన‌ని ఆమె మ‌రోసారి చెప్పారు. ఆమె ఈ రోజు త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై ప్ర‌క‌ట‌న చేస్తార‌న్న ఊహాగానాలూ వ‌స్తున్నాయి.


More Telugu News