ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. భక్తులపైనుంచి దూసుకెళ్లిన కారు.. చెల్లాచెదరుగా ఎగిరిపడిన భక్తులు.. వీడియో వైరల్!

  • ఒకరి మృతి, 16 మందికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
  • మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
  • రాజకీయ రంగు పులుముకున్న వైనం
  • ఎవ్వరినీ వదిలిపెట్టబోమన్న ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్
  • ఘటనకు నిరసనగా నేడు జాస్పూర్‌లో బీజేపీ బంద్
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటనను మర్చిపోకముందే ఛత్తీస్‌గఢ్‌లో అలాంటి ఘటనే నిన్న జరిగింది. దుర్గామాత విగ్రహాన్ని ఊరేగిస్తున్న భక్తులపైకి వేగంగా వచ్చిన కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి ఎముకలు విరిగిపోవడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది.  

ఛత్తీస్‌గఢ్‌లోని జాస్పూరు జిల్లా పాతల్‌గావ్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. నవరాత్రుల్లో దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో పూజించిన భక్తులు విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్న సమయంలో వేగంగా వచ్చిన కారు వారి మీదుగా దూసుకుపోయింది. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆగ్రహంతో స్థానికులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదారు. పాతల్‌గావ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి వరకు నిరసన కొనసాగింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన కారులో గంజాయి ఉన్నట్టు ఆరోపించారు.

ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని మధ్యప్రదేశ్‌కు చెందిన బబ్లూ విశ్వకర్మ (21), శిశుపాల్ సాహు (26)గా గుర్తించారు. ఒడిశా నుంచి డ్రగ్స్ తీసుకుని మధ్యప్రదేశ్ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. అలాగే, వారి కారు నుంచి పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు జాస్పూర్ ఐజీ అజయ్ యాదవ్, ఎస్పీ విజయ్ అగర్వాల్ తెలిపారు.

మరోపక్క, ఈ ఘటనపై ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తీవ్రంగా స్పందించారు. నిందితులను అరెస్ట్ చేశామని, ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ట్వీట్ చేశారు. ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కాగా, మృతుడి కుటుంబానికి ప్రభుత్వం గత రాత్రి రూ. 50 లక్షల పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చుతో పూర్తి చికిత్స అందిస్తామని పేర్కొంది. మరోవైపు, ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఘటనకు నిరసనగా బీజేపీ నేడు జాస్పూర్‌లో బంద్ నిర్వహిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణు దేవ్ సాయి మృతుడి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.


More Telugu News