దేశంలో జనాభా అసమతుల్యత సమస్యగా మారింది.. నియంత్రించాల్సిందే: మోహన్ భగవత్

  • దేశంలో జనాభా నియంత్రణ తీసుకురావాల్సిన అవసరం ఉంది
  • భారత్ ఎదుగుదలను కొన్ని దేశాలు తమకు అడ్డంకిగా భావిస్తున్నాయి
  • ప్రజల్ని భయపెట్టేందుకు ఉగ్రవాదులు హింసను ఆశ్రయిస్తున్నారు
  • మన సామాజిక స్పృహ ఇప్పటికీ కుల ఆధారిత వక్ర భావాలతోనే  నిండిపోయింది
దేశంలో జనాభా అసమతుల్యత పెను సమస్యగా మారిందని, దీనిని నియంత్రించాల్సి ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దసరా సందర్భంగా నిన్న నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భగవత్.. అనంతరం సంఘ్ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడారు.

దేశంలో జనాభా నియంత్రణ విధానాన్ని మరోమారు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని దానిని రూపొందించాలని, అందరికీ సమానంగా వర్తింపజేయాలని అన్నారు. స్వాధీనం నుంచి స్వతంత్రం వరకు సాగిన మన ప్రయాణం ఇంకా పూర్తికాలేదని, భారతదేశ ఎదుగుదల, ఔన్నత్యాన్ని కొన్ని దేశాలు తమ స్వప్రయోజనాలకు అడ్డంకిగా భావిస్తున్నాయని అన్నారు.

 జమ్మూకశ్మీర్‌లో ప్రజల్ని బయపెట్టేందుకు ఉగ్రవాదులు హింసను ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు చైనా, పాకిస్థాన్ మద్దతు ఇస్తున్నాయని ఆరోపించారు. తాలిబన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కుల ఆధారిత వక్ర భావాలతో నిండిన మన సామాజిక స్పృహను మార్చుకోవాల్సిన అవసరం ఉందని భగవత్ అన్నారు.


More Telugu News