వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై క్లారిటీ ఇచ్చిన డీఎల్ రవీంద్రారెడ్డి

  • 2024 ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తా
  • ఏపీలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి
  • వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయింది
2024 ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు.

తన పొలాన్ని కౌలుకు ఇద్దామనుకుంటే... తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని చెప్పారు. రాష్ట్ర మంత్రులెవరూ వారి శాఖలకు సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టడం లేదని విమర్శించారు. సొంత ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా పాలకులు పని చేస్తున్నారని దుయ్యబట్టారు. పాలకుల అక్రమాలను ప్రజలు నిలదీయాలని అన్నారు.

జగన్ వైసీపీని ఏర్పాటు చేసిన సమయంలో ఆయనపై కడప ఎంపీ అభ్యర్థిగా డీఎల్ రవీంద్రారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఆ ఎన్నికల్లో మైదుకూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు డీఎల్ ఆసక్తి చూపగా...ఆ స్థానంలో సుధాకర్ యాదవ్ ను చంద్రబాబు బరిలోకి దింపారు.

అనంతరం 2019 ఎన్నికల సమయంలో ఆయన వైసీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. హైదరాబాద్ లోటస్ పాండ్ లో జగన్ ను ఆయన కలిశారు. ఆ ఎన్నికల్లో వైసీపీకి మద్దతు పలికారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీకి కూడా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఆయన ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.


More Telugu News