హిందూ ఆలయాలపై దాడి చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా

  • దుర్గా పూజ సందర్భంగా కొన్ని ఆలయాలపై దాడులు
  • ఏ మతానికి చెందిన వారైనా ఉపేక్షించబోమన్న హసీనా
  • టెక్నాలజీ సాయంతో త్వరగా పట్టుకుంటామని వెల్లడి
దుర్గామాత పూజల సందర్భంగా బంగ్లాదేశ్ లోని కొన్ని హిందూ ఆలయాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. మత ఘర్షణలను రెచ్చగొట్టేందుకు కొందరు దుండగులు యత్నించారు. ఈ నేపథ్యంలో దేవాలయాలపై దాడులకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా స్పష్టం చేశారు.

22 జిల్లాల్లో పారామిలిటరీ బలగాలను మోహరింపజేయనున్నట్టు ప్రకటించారు. జరిగిన ఘటనలపై లోతుగా దర్యాప్తు చేయిస్తామని హసీనా చెప్పారు. దాడులకు పాల్పడిన వారు ఏ మతానికి చెందిన వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఘటనకు సంబంధించి ఇప్పటికే ఎంతో సమాచారం అందిందని తెలిపారు. ప్రస్తుతం ఎంతో సాంకేతికత అందుబాటులో ఉందని... టెక్నాలజీ సాయంతో వారిని త్వరగా పట్టుకుంటామని చెప్పారు. ఢాకాలోని ఢాకేశ్వరీ ఆలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News