పాఠశాల ప్రిన్సిపాల్ పోస్టు కోసం త‌న్నులాట‌.. వీడియో వైర‌ల్

  • పోస్టు కోసం మూడు నెల‌లుగా పోటీ ప‌డుతున్న ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుడు
  • అందుకోసం విద్యాశాఖ కార్యాల‌యానికి వెళ్లిన వైనం
  • ఉపాధ్యాయురాలి భ‌ర్త‌, ఉపాధ్యాయుడి మ‌ధ్య త‌న్నులాట‌
 పాఠశాలలో ప్రిన్సిపాల్ పోస్టు కోసం ఓ ఉపాధ్యాయిని, ఓ ఉపాధ్యాయుడు మూడు నెల‌లుగా పోటీ ప‌డుతున్నారు. అందుకోసం విద్యాశాఖ కార్యాల‌యం చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్ర‌మంలో ఉపాధ్యాయురాలి భ‌ర్త‌, ఉపాధ్యాయుడు విద్యాశాఖ కార్యాల‌యంలోనే కొట్టుకున్నారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాల‌ను అక్క‌డి సిబ్బంది స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించి, సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేయ‌డంతో ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని మోతీహ‌రిలో చోటు చేసుకుంది. రింకీ కుమారి, శివ‌శంక‌ర్ గిరి అనే ఇద్ద‌రు టీచ‌ర్లు అదాపూర్ ప్రాథ‌మిక‌ పాఠ‌శాల‌లో ప‌ని చేస్తున్నారు.

ప్రిన్సిపాల్ పోస్టు కోసం రాష్ట్ర విద్యాశాఖ కార్యాల‌యానికి వెళ్లారు. ఆ ఇద్ద‌రు టీచ‌ర్ల విద్యార్హ‌త‌ల ప‌త్రాల‌ను మూడు రోజుల్లోగా స‌మ‌ర్పించాల‌ని అక్కడి అధికారులు చెప్పారు. అయితే, వారిద్ద‌రిలో ఎవ‌రు మొద‌ట వాటిని స‌మ‌ర్పిస్తారు? అనే విష‌యంలో రింకీ భ‌ర్త‌కు, శివ‌శంక‌ర్ గిరికి మ‌ధ్య గొడ‌వ చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ప‌ర‌స్ప‌రం కొట్టుకున్నారు. శివ‌శంక‌ర్ గిరిని రింకీ భ‌ర్త‌ కింద‌ప‌డేసి కొట్టాడు. ఈ ఘ‌ట‌న‌పై అధికారులు విచార‌ణ చేప‌ట్టారు.


More Telugu News