దేవరగట్టులో నేడు కర్రల సమరం.. భారీ స్థాయిలో పోలీసు భద్రత

  • భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు
  • కర్రల సమరంలో గాయపడే వారికి చికిత్స కోసం ప్రత్యేక వైద్య సదుపాయం
  • ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు యుద్ధాన్ని తలపించే సమరం
దసరా వస్తుందంటే చాలు కర్నూలు జిల్లాలోని దేవరగట్టు కర్రల సమరానికి సిద్ధమైపోతుంది. ఇక్కడ దాదాపు 800 అడుగుల ఎత్తైన కొండపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాల సందర్భంగా స్వామి ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు; అరికెర, అరికెర తండా సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు తలపడతారు.  యుద్ధాన్ని తలపించే ఈ సమరంలో ఎంతోమంది గాయపడతారు. అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయం కోసం ఈసారి పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో ఏడుగురు డీఎస్పీలు, 23 మంది సీఐలు, 60 మంది ఎస్సైలు, 164 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 322 మంది కానిస్టేబుళ్లు, 20 మంది మహిళా పోలీసులు, 50 మంది ప్రత్యేక పోలీసు బృందం సభ్యులు, మూడు ప్లాటూన్ల ఆర్మ్‌డ్ రిజర్వు సిబ్బంది, 200 మంది హోంగార్డులను మోహరించనున్నారు.

అలాగే, దేవరగట్టు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కర్రల సమరంలో గాయపడే వారికి చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా 20 పడకలతో ఓ వైద్యశాలను ఏర్పాటు చేశారు. అవసరమైన ఔషధాలు, 108 వాహనాలు అందుబాటులో ఉంచారు. అలాగే, విద్యుత్ ప్రసారంలో అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.


More Telugu News