కాబూల్‌కు విమాన సర్వీసులు నిలిపివేసిన పాకిస్థాన్

  • టికెట్ ధరలు తగ్గించాలని ఆదేశం
  • ప్రస్తుతం కాబూల్-ఇస్లామాబాద్ మధ్య టికెట్ ధర 2500 డాలర్లు
  • ఆగస్టు ముందునాటి ధరలకు తగ్గించాలని తాలిబన్ల పట్టు
  • లేకుంటే విమాన సర్వీసులు రద్దు చేస్తామని హెచ్చరిక
ఆఫ్ఘనిస్థాన్‌కు నడుస్తున్న ఒకే ఒక్క అంతర్జాతీయ విమాన ప్రయాణాలు కూడా ఆగిపోయాయి. ఆ దేశానికి విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్టు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ప్రకటించింది. టికెట్ ధరలను తగ్గించాలని, లేదంటే విమాన సర్వీసులను నిలిపివేస్తామని ఆఫ్ఘన్‌లోని తాలిబన్ ప్రభుత్వం హెచ్చరించడమే అందుకు కారణం. ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడానికి ముందు అంటే ఆగస్టు 15 వరకు కాబూల్-ఇస్లామాబాద్ మధ్య టికెట్ ధర 120-150 డాలర్ల మధ్య ఉండేది. కానీ ఇప్పుడది 2500 డాలర్లుగా ఉంది.

ఈ నేపథ్యంలో మునుపటి ధరలతో విమాన సర్వీసులను నడపాలని తాలిబన్లు ఆదేశించారు. టికెట్ ధరలను తగ్గించలేని పీఐఏ విమాన సర్వీసులను రద్దు చేసింది. తాము మానవతా దృక్పథంతోనే విమాన సర్వీసులు నడుపుతున్నామని పాకిస్థాన్ ప్రకటించింది. బీమా సంస్థలు కాబూల్‌ను యుద్ధ ప్రాంతంగా పరిగణిస్తున్నందున బీమా ప్రీమియం ధరలు భారీగా పెరిగాయని, అందుకనే టికెట్ ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొంది. మరోవైపు, తమ సిబ్బందిని తాలిబన్లు భయపెడుతున్నారని పీఐఏ ఆరోపించింది.


More Telugu News