బతుకమ్మ పండుగ సందర్భంగా తెలుగులో సందేశమిచ్చిన ఎ.ఆర్. రెహ్మాన్

  • సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మ్యూజిక్ మాస్ట్రో
  • బతుకమ్మ అంటే ఐకమత్యానికి ప్రతిబింబమని కామెంట్
  • ఆటపాటల్లో ఎంతో అనుభూతి ఉంటుందని ట్వీట్
మ్యూజిక్ మాస్ట్రో ఎ.ఆర్. రెహ్మాన్ తెలుగులో మెసేజ్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అంటూ తెలుగులో ట్వీట్ చేశారు. బతుకమ్మ అంటే ఐకమత్యాన్ని ప్రతిబింబించే ఉత్సవమని అన్నారు. ఆటపాటల బతుకమ్మ పండుగలో ఎంతో గొప్ప అనుభూతి ఉందన్నారు.

ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణలోని ప్రతి ఆడపడుచూ సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. బతుకమ్మ అంటూ తెలుగు, ఇంగ్లిష్ లో ఆయన హాష్ ట్యాగ్ ఇచ్చారు. ఆ పోస్ట్ కు తాను స్వరపరిచిన ‘అల్లిపూల బతుకమ్మ’ పాటను జత చేశారు.

కాగా, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ పాటను రూపొందించిన సంగతి తెలిసిందే. ఎ.ఆర్ రెహ్మాన్ బాణీలు సమకూర్చితే.. పాటను గౌతమ్ మేనన్ చిత్రీకరించారు. ఆ పాట యూట్యూబ్ లో దూసుకుపోతోంది.


More Telugu News