ఏపీ అధికారిని అడ్డగించిన ఒడిశా ఎమ్మెల్యే.. అధికారికి మద్దతుగా నిలిచిన గిరిజనులు!

  • ఆంధ్రాలో కలిసిపోయేందుకు ప‌గులు చెన్నేరు, పట్టుచెన్నేరు ప్ర‌జ‌ల ఆసక్తి
  • ఆ పంచాయ‌తీల‌ ప్రజలతో నిన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికారుల భేటీ
  • ఆ స‌మ‌యంలో అక్క‌డ‌కు వ‌చ్చిన ఒడిశాలోని పొట్టంగి ఎమ్మెల్యే
  • 'ఆంధ్రా గో బ్యాక్‌' అంటూ ఎమ్మెల్యే, అనుచ‌రుల నినాదాలు
  • ఎమ్మెల్యేను వెళ్ల‌గొట్టిన గిరిజ‌నులు
ఆంధ్రాలో కలిసిపోయేందుకు ఆస‌క్తి చూపుతోన్న ఒడిశాలోని పగులు చెన్నేరు, పట్టుచెన్నేరు పంచాయతీల ప్రజలతో నిన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ అధికారులు సమావేశమయ్యారు. అయితే, ఆ స‌మ‌యంలో అక్క‌డ‌కు వ‌చ్చిన ఒడిశాలోని పొట్టంగి ఎమ్మెల్యే పీతం పాడి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

'ఆంధ్రా గో బ్యాక్‌' అంటూ ఆ ఎమ్మెల్యే, ఆయ‌న అనుచ‌రులు నినాదాలు చేశారు. దీంతో ఆంధ్ర అధికారులకు మ‌ద్ద‌తు ప‌లుకుతూ గిరిజ‌నులు ఒడిశా ఎమ్మెల్యేకు ఎదురు తిరిగారు. గిరిజ‌నుల దెబ్బ‌కు ఎమ్మెల్యేతో పాటు ఆయ‌న అనుచ‌రులు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.

ఆంధ్ర, ఒడిశా మ‌ధ్య ఉన్న‌ వివాదాస్పద కొటియా గ్రూప్‌ గ్రామాల్లోని పగులు చెన్నేరు పంచాయతీలో ఆంధ్రప్ర‌దేశ్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తోంది. వాటి పరిశీలనకు పార్వతీపురం ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ వెళ్లగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గిరిజ‌నుల సమస్యలను ఆంధ్ర అధికారులు తెలుసుకున్నారు. కొటియా రెండు రాష్ట్రాల వివాదాస్పద భూభాగమని, ఈ అంశం ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో ఉంద‌ని కూర్మ‌నాథ్ తెలిపారు.


More Telugu News