రాజధానిని సమూలంగా నాశనం చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది: అమరావతి జేఏసీ, ప్రజాసంఘాల నేతలు

  • 666వ రోజుకు చేరుకున్న అమరావతి ఉద్యమం
  • మహాపాదయాత్రకు సీపీఐ మద్దతు
  • హైకోర్టు న్యాయవాది రచించిన గీతాల సీడీ ఆవిష్కరణ
ఏపీ రాజధాని అమరావతి కోసం జరుగుతున్న ఉద్యమం 666వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో అమరావతిలోని మోతడకలో నిన్న రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజధాని ఉద్యమ గీతాల సీడీలను జేఏసీ నేతలు ఆవిష్కరించారు.

 ఈ సందర్భంగా జేఏసీ, ప్రజా సంఘాలు, సీపీఐ నేతలు మాట్లాడుతూ.. అమరావతిపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిని సమూలంగా నాశనం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇందులో భాగంగా అర్థ, అంగ బలగాలను ప్రదర్శిస్తోందని ఆరోపించారు. మహాపాదయాత్రకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్టు అమరావతి జేఏసీ కన్వీనర్ సుధాకర్ తెలిపారు.

ఆంధ్రులంతా ఏకమై ప్రభుత్వ కుట్రల్ని తిప్పికొట్టాలని మాజీ ఎమ్మెల్యే యలమంచిలి వీరాంజనేయులు పిలుపునిచ్చారు. అమరావతి ఆందోళనల్లో భాగంగా నెక్కల్లు, తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్ధండరాయునిపాలెం, వెంకటపాలెం, రాయపూడి తదితర గ్రామాల్లో నిరసనలు జరిగాయి.

కాగా, ఉద్యమం 666వ రోజుకు చేరుకున్న సందర్భంగా ‘‘అహో ఆంధ్రులారా అసమాన ధీరులారా.. రాజధాని సమర సైనికులారా.. అమరావతికి అండగా నిలవండి.. భావి తరాలను కాపాడండి’’ అని సాగే ఉద్యమ గీతాన్ని అమరావతి జేఏసీ నేతలు విడుదల చేశారు. హైకోర్టు న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు ఈ గీతాలను రచించి ఆర్థిక సహకారం కూడా అందించారు. ప్రజా నాట్యమండలికి చెందిన రమణ బృందం ఈ గీతాలను ఆలపించింది.


More Telugu News