అన్నదమ్ముల మధ్య ఎట్టకేలకు కుదిరిన సయోధ్య.. తేజస్వి సీఎం కావాలంటున్న తేజ్ ప్రతాప్

  • ప్రధాన ప్రచారకర్తల జాబితాలో తన పేరు లేకపోవడంపై తేజ్ ప్రతాప్ కినుక
  • తిరుగుబాటు అభ్యర్థుల తరపున ప్రచారం చేయబోతున్నట్టు వార్తలు
  • వచ్చేవారం పాట్నీలో పర్యటించనున్న లాలూ
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కుమారుల మధ్య చెలరేగిన మనస్పర్థలకు ఎట్టకేలకు తెరపడింది. తాజా పరిణామాలు చూస్తుంటే తేజ్‌ప్రతాప్, తేజస్వీయాదవ్ మధ్య సయోధ్య కుదిరినట్టే కనిపిస్తోంది. బీహార్‌లో రెండు శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, ప్రధాన ప్రచారకర్తల జాబితాలో తన పేరు లేకపోవడం తేజ్‌ప్రతాప్‌‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో ఆయన తిరుగుబాటు అభ్యర్థుల తరపున ప్రచారం చేయబోతున్నట్టు వార్తలు వినిపించాయి.

అయితే, అంతలోనే ఏమైందో కానీ తన తమ్ముడు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని ఆశిస్తున్నట్టు నిన్న విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.తాను తిరుగుబాటు అభ్యర్థుల తరపున ప్రచారం చేయబోతున్నట్టు వస్తున్న వార్తలు నిజం కాదని, అసలు అలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయని విలేకరులను ఎదురు ప్రశ్నించారు. ఏది ఏమైనా అన్నదమ్ములు ఇద్దరి మధ్య సయోధ్య కుదరడం మంచి పరిణామమని ఆర్జేడీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, లాలూ ప్రసాద్ యాదవ్ వచ్చే వారం పాట్నాలో పర్యటించబోతున్నట్టు ఆ పార్టీ నేతలు తెలిపారు.


More Telugu News