ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ లోనే లేడు: ముంబై కోర్టులో ఆర్యన్ తరపు లాయర్ వాదన

  • డ్రగ్స్ కేసులో రిమాండులో ఉన్న షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్
  • ఆర్యన్ వద్ద డ్రగ్స్ దొరకలేదన్న లాయర్
  • బెయిల్ రాకుండా చేసేందుకు ఎన్సీబీ ప్రయత్నిస్తోందని వాదన
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన బెయిల్ కు సంబంధించి ముంబై సెషన్స్ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ఆర్యన్ తరపు లాయర్ అమిత్ దేశాయ్ కోర్టులో తన వాదలను వినిపిస్తూ... ఆర్యన్ వద్ద డబ్బులు లేవని, డబ్బులు లేనప్పుడు డ్రగ్స్ కొనలేడని చెప్పారు. అలాంటప్పుడు ఆయన డ్రగ్స్ వినియోగించే అవకాశమే లేదని అన్నారు. ఆర్యన్ వద్ద ఎటువంటి డ్రగ్స్ దొరకలేదని చెప్పారు.

అర్బాజ్ మర్చంట్ వద్ద ఆరు గ్రాముల చరస్ ను అధికారులు గుర్తించారని... ఆ చరస్ ను కూడా అర్బాజ్ సొంతంగా వినియోగించేందుకు తన వద్ద పెట్టుకున్నాడని, అమ్మడానికి కాదని తెలిపారు. ఇదే సమయంలో ఆయన మరో అడుగు ముందుకేసి అసలు క్రూయిజ్ లో ఆర్యన్ లేనే లేడని వాదించారు.

ఇల్లీగల్ ఇంటర్నేషనల్ డ్రగ్ ట్రాఫికింగ్ అనే విషయాన్ని ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) ప్రస్తావించిందని... ఇలాంటి పదాలను వాడటం సరికాదని అమిత్ దేశాయ్ అన్నారు. కేవలం బెయిల్ రాకుండా చేసేందుకే ఎన్సీబీ ఇలాంటి పదాలను వాడుతోందని చెప్పారు. అంతర్జాతీయ డ్రగ్స్ ట్రాఫికింగ్ తో ఆర్యన్ పేరును ఎలా ముడిపెడతారని ప్రశ్నించారు. ఇలాంటి ఎన్నో కేసులను కోర్టు చూసిందని చెప్పారు.

ఆర్యన్ వద్ద నుంచి నిషేధిత డ్రగ్స్ ను గుర్తించకుండానే అంతర్జాతీయ డ్రగ్స్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేయడం దారుణమని అన్నారు. ఆర్యన్ కేసు వెనుక పెద్ద కుట్ర ఉందని చెప్పారు. క్రూయిజ్ నుంచే అందరినీ అరెస్ట్ చేయలేదని... కొందరిని బయట కూడా అరెస్ట్ చేశారని అన్నారు. ఆర్యన్ క్రూయిజ్ లో లేడని, ఆయన వద్ద ఏమీ లేదని చెప్పారు. మాదకద్రవ్యాలను పండించడం, ఉత్పత్తి చేయడం, తయారు చేయడం, వినియోగించడం, రవాణా చేయడం వంటివన్నీ అక్రమ రవాణా కిందకు వస్తాయని... ఆర్యన్ కు వీటిలో ఏ ఒక్క దానితో సంబంధం లేదని అన్నారు.


More Telugu News