కొవిషీల్డ్, కొవాగ్జిన్ లకు బూస్టర్ డోసుగా కొత్త టీకా!

  • కార్బివాక్స్ ను ఇవ్వాలని ‘బయోలాజికల్ ఈ’ విజ్ఞప్తి
  • డీసీజీఐకి దరఖాస్తు చేసిన సంస్థ
  • ఇప్పటికే వాక్సిన్ తీసుకున్న వారిపై ట్రయల్స్
కరోనా టీకాలు కొవిషీల్డ్, కొవాగ్జిన్ లకు బూస్టర్ డోసుగా ‘కార్బివాక్స్’ను అనే వాక్సిన్ ను హైదరాబాద్ ఫార్మా సంస్థ ‘బయోలాజికల్ ఈ’ అభివృద్ధి చేసింది. దీనికి అనుమతులు ఇవ్వాల్సిందిగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు సంస్థ దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కొవిషీల్డ్, కొవాగ్జిన్ లను రెండు డోసులుగా ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మూడో డోసుగా (బూస్టర్) కార్బివాక్స్ కు అనుమతులు ఇవ్వాల్సిందిగా సంస్థ కోరినట్టు అధికారులు చెబుతున్నారు.

విదేశాల్లో టీకా రెండు డోసులు వేసుకున్నా ప్రతిరక్షకాలు.. కొన్ని నెలల్లోనే తగ్గుతున్నట్టు చాలా అధ్యయనాల్లో తేలిందని, దీంతో ఆయా దేశాలు తమ ప్రజలకు బూస్టర్ డోసులను వేస్తున్నాయని సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మన దేశంలోనూ సింగిల్ డోస్ కార్బివాక్స్ ను బూస్టర్ డోసుగా ఇవ్వాలని కోరింది. అందుకుగానూ ఇప్పటికే ఇతర వ్యాక్సిన్లను తీసుకున్న వారిలో కార్బివాక్స్ ప్రభావాన్ని తెలుసుకోవడం కోసం మూడో దశ ట్రయల్స్ కు అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేసింది.

ఇప్పటికే ఫేజ్ 2/3 ట్రయల్స్ చేసేందుకు సంస్థకు డీసీజీఐ అనుమతినిచ్చింది. 18 నుంచి 80 ఏళ్ల మధ్య వారిపై ప్రస్తుతం ఆ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరునాటికి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అంతేగాకుండా పిల్లల వాక్సిన్ ట్రయల్స్ కూ గత నెలలో డీసీజీఐ అనుమతులను మంజూరు చేసింది.


More Telugu News