నన్ను 'మా' ఎన్నికల నుంచి తప్పుకోమని చిరంజీవి చెప్పారు!: మంచు విష్ణు వెల్లడి

  • మంచు విష్ణు ప్రెస్ మీట్
  • ఎన్నికల ముందు పరిణామాలపై వివరణ
  • ప్రకాశ్ రాజ్ ఏకగ్రీవానికి చిరు ప్రతిపాదించారని వెల్లడి
  • తాము అంగీకరించలేదని విష్ణు స్పష్టీకరణ
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నూతన అధ్యక్షుడు మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన విషయాన్ని వెల్లడించారు. తనను 'మా' ఎన్నికల బరి నుంచి తప్పుకోమని చెప్పింది చిరంజీవేనని స్పష్టం చేశారు.

"మా నాన్న గారిని ఈ విషయంలో రిక్వెస్ట్ చేసింది ఎవరో చెప్పకూడదేమో కానీ, ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి చెబుతున్నా.... నన్ను సైడయిపోవాలని కోరింది చిరంజీవి అంకులే. ఎన్నికలు ఎందుకు... ప్రకాశ్ రాజ్ ను ఏకగ్రీవం చేద్దాం అని మా నాన్నకు చిరంజీవి అంకుల్ చెప్పారు. కానీ నేను తప్పుకోవాలని భావించలేదు. మా నాన్న నిర్ణయం కూడా అదే. ఎన్నికలకు వెళదామనే మేం నిర్ణయించుకున్నాం" అని వివరించారు.

అంతకుముందు రామ్ చరణ్ గురించి చెబుతూ మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ 99 శాతం ప్రకాశ్ రాజ్ కే ఓటేసి ఉంటాడని చెప్పగలనని, ఎందుకంటే చరణ్ తండ్రి మాట జవదాటడని అన్నారు. "నేను కూడా మా నాన్న మాటను పాటిస్తాను. చరణ్ కూడా అంతే. అందులో తప్పేమీలేదు. చరణ్ స్థానంలో నేనున్నా అదే చేస్తాను. ప్రకాశ్ రాజ్ కు ఓటేశాడని మా మధ్య అనుబంధంలో ఎలాంటి మార్పు ఉండదు. చరణ్ నాకు సోదరుడు" అని పేర్కొన్నారు.


More Telugu News