చైనాతో చర్చలు విఫలం.. భారత్ చెప్పిన వాటికి ఒప్పుకోని డ్రాగన్ కంట్రీ

  • తదుపరి చర్చలకూ అంగీకరించని వైనం
  • ఘర్షణ తగ్గించేందుకు భారత్ నిర్మాణాత్మక సూచనలు
  • సత్యదూరమైన డిమాండ్లన్న కమ్యూనిస్ట్ దేశం
ఇటీవల మళ్లీ కయ్యానికి కాలు దువ్విన డ్రాగన్ దేశం చైనా.. చర్చలను ముందుకు సాగనివ్వలేదు. భారత్ చెప్పిన షరతులకు ఒప్పుకోలేదు. తదుపరి చర్చలకూ అంగీకరించలేదు. మొత్తంగా చర్చలు విఫలమయ్యాయి. ఇటీవల చైనా–భారత్ మధ్య 13వ రౌండ్ చర్చలు మొదలైన సంగతి తెలిసిందే.

చైనా ఉన్నతాధికారులు భారత షరతులకు ఒప్పుకోవట్లేదని భారత ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు. పరిష్కారం జరగని మిగతా ప్రాంతాలపై భారత్ నిర్మాణాత్మక సూచనలను చేసినా చైనా వినిపించుకోలేదని, వాటికి అంగీకరించలేదని తెలిపారు. దీంతో ఎలాంటి ప్రయోజనం లేకుండానే చర్చలు ముగిశాయని అన్నారు.

అయితే, సమాచారమార్పిడి, సరిహద్దుల్లో స్థిరత్వానికి ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రొటోకాల్స్ కు లోబడి మిగతా ప్రాంతాల్లోని సమస్యలను త్వరలోనే పరిష్కరించుకుంటామని చెప్పారు.

ఇటు చైనా కూడా చర్చలు విఫలమైనట్టు ప్రకటించింది. హేతుబద్ధం కాని సత్యదూరమైన డిమాండ్లను భారత్ పెడుతోందని తెలిపింది. అందువల్లే చర్చలు సజావుగా సాగట్లేదని పేర్కొంది. సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణాన్ని తగ్గించేందుకు తాము నిజాయతీగా పనిచేశామని చెప్పింది.


More Telugu News