మీడియాపై యాంకర్ ఝాన్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

  • ఎద్దు, పుండు, కాకులతో పోల్చిన వైనం
  • పొడుచుకు తింటున్నాయని వ్యంగ్య వ్యాఖ్యలు
  • మైకులు పెట్టి జనంపై రుద్దుతున్నారని కామెంట్లు
  • ప్రజా ప్రయోజనం అంటే ఏంటో డిక్షనరీలో చూడాలంటూ వ్యాఖ్య
మీడియాపై యాంకర్ ఝాన్సీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎద్దు, పుండు కాకి అంటూ పోలికలు పెడుతూ కామెంట్లు చేశారు. ‘అనగనగా ఓ ఎద్దు.. దానికో పుండు. ఆ పుండులో పురుగులు. ఎద్దుపుండు కాకికి ముద్దు. కబుర్లు చెప్పాల్సిన కాకులు పొడిచిపొడిచి పుండులోని పురుగులను తింటున్నాయి. పుండును పెద్దది చేశాయి. ఎద్దు బుసలు కొట్టి రెచ్చిపోయింది. కాకులు గోల పెంచాయి’ అంటూ వ్యాఖ్యానించారు.

‘‘మైకులు పెట్టి మరీ మురికి గొట్టాలని జనాల ఇళ్లలోకి వదలడం మించి వేరే ముఖ్యమైన వార్తలు లేవా? సినిమా ఇంట పెళ్లి అయినా, విడాకులైనా, ఎన్నికలైనా లోకులకు సందడి అనుకుని హడావుడి చేస్తున్న కాకుల్లారా.. ప్రజాప్రయోజనం అంటే ఏంటో డిక్షనరీలో చూడండి’’ అని పేర్కొన్నారు.  

జనం ఏం కావాలనుకుంటున్నారో అది ఇవ్వకుండా.. వాళ్లకు నచ్చిందే జనాలపై బలవంతంగా రుద్దుతున్నారంటూ మీడియాను విమర్శించారు. వారికి జనాలు బలిపశువులన్నారు. మాయ చేసే కెమెరా లెన్సులను చూడగానే వారికి మతి పోతోందన్నారు. ఇలాంటి చెత్తను ఇవ్వొద్దని, వార్తలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని ఝాన్సీ అన్నారు.



More Telugu News