పాకిస్థాన్ 'అణు పితామహుడు' అబ్దుల్ ఖదీర్ ఖాన్ కన్నుమూత

  • కరోనాతో కన్నుమూసిన ఖదీర్ ఖాన్
  • ఏక్యూ ఖాన్ గా గుర్తింపు పొందిన అణు శాస్త్రవేత్త
  • సంతాపం తెలిపిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్
  • దేశాన్ని అణుశక్తిగా నిలిపారంటూ కితాబు
పాకిస్థాన్ ను అణుశక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ కన్నుమూశారు. 85 ఏళ్ల అబ్దుల్ ఖదీర్ ఖాన్ కరోనాతో మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. అబ్దుల్ ఖదీర్ ఖాన్ పాక్ 'అణు పితామహుడు'గా ఖ్యాతి పొందారు. ఆయనను అందరూ 'ఏక్యూ ఖాన్' అని పిలుస్తుంటారు. ఇస్లామిక్ దేశాలన్నింటిలో అణుబాంబు తయారుచేసిన మొదటి దేశంగా పాకిస్థాన్ ను నిలిపిన ఘనత ఖదీర్ ఖాన్ సొంతం.

అయితే పాశ్చాత్య దేశాల నుంచి అణు పరిజ్ఞానాన్ని దొంగిలించి వాటితో అణ్వస్త్రాలు రూపొందించాడన్న అపవాదును ఆయన ఎదుర్కొన్నారు. అంతేకాదు, పాక్ అణు రహస్యాలను ఉత్తర కొరియా, ఇరాన్ వంటి దేశాలకు చేరవేశాడన్న ఆరోపణలపై అరెస్ట్ కూడా అయ్యారు.

ఖదీర్ ఖాన్ మృతి పట్ల ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంతాపం తెలియజేశారు. నేషనల్ ఐకాన్ ను కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. దేశం ఆయనను ఎంతగానో ప్రేమించిందని, ఎందుకంటే ఆయన పాక్ ను ఓ అణుశక్తిగా నిలిపారని కొనియాడారు.


More Telugu News