జ‌య‌ల‌లిత బాట‌లోనే వెళ్తా.. న‌న్ను ఏ శ‌క్తీ అడ్డుకోలేదు: రాజ‌కీయాల‌పై శ‌శిక‌ళ కీల‌క వ్యాఖ్య‌లు

  • జ‌య‌ల‌లిత‌ క‌ల‌ల‌ను నెర‌వేర్చాల్సి ఉంది
  • అడ్డు వచ్చిన వారిని  సైతం ఎదుర్కొని ముందుకు వెళ్తా
  • అన్నాడీఎంకేకు ప్రత్యర్థుల నుంచి బలమైన పోటీ
  • పార్టీలో విపరీతంగా వ్య‌తిరేక‌త
త‌మిళ‌నాడులో జ‌య‌ల‌లిత బాట‌లోనే వెళ్తానంటూ అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆమె క‌ల‌ల‌ను నెర‌వేర్చాల్సి ఉంద‌ని చెప్పారు. జైలు నుంచి విడుద‌లైన నాటి నుంచి రాజ‌కీయాల‌పై స్పందించ‌కుండా ఉంటోన్న ఆమె.. అన్నాడీఎంకే అధికార పత్రిక నమదు ఎంజీఆర్‌లో  పార్టీ శ్రేణుల‌ను ఉద్దేశించి ఓ ఆర్టిక‌ల్ రాశారు. తనను ఏ శక్తీ అడ్డుకోలేదని ఆమె చెప్ప‌డం గ‌మ‌నార్హం.

త‌న‌కు అడ్డు వచ్చిన వారిని సైతం ఎదుర్కొని ముందుకు వెళ్తాన‌ని చెప్పారు. అన్నాడీఎంకేకు ప్రత్యర్థుల నుంచి బలమైన పోటీ ఎదురవుతోందని ఆమె అన్నారు. ఇప్పుడు పార్టీలో విపరీతంగా వ్య‌తిరేక‌త క‌న‌ప‌డుతోంద‌ని చెప్పారు. దీన్నిబట్టే ప్ర‌స్తుతం పార్టీలో ఎలాంటి ప‌రిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు.

ప్రత్యర్థులకు భయపడబోన‌ని తెలిపారు. అలాగే, పార్టీ కార్యకర్తలు కూడా ఎవ్వరికీ భయపడాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. శశికళ చేసిన వ్యాఖ్య‌ల‌పై అన్నాడీఎంకే నేతలు ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేదు. గతంలో అన్నాడీఎంకే గురించి శశికళ ప్ర‌స్తావిస్తే మాజీమంత్రి డి.జయకుమార్ ఆమెపై విమ‌ర్శ‌లు గుప్పించేవారు. ఇప్పుడు ఆయ‌న కూడా మాట్లాడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఆమెతో పార్టీ నేత‌ల‌కు కుదిరిన ఒప్పందంలో భాగంగానే  నేతలు స్పందిచడం లేద‌న్న వాద‌న‌లు విన‌ప‌డుతున్నాయి.


More Telugu News