కరోనామాత ఆలయ కూల్చివేతను సవాలు చేస్తూ పిటిషన్ వేసిన వ్యక్తులపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. రూ. 5 వేల చొప్పున జరిమానా

  • జూన్ 7న యూపీలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఆలయ నిర్మాణం
  • వివాదాస్పద స్థలంలో నిర్మించారంటూ 11న కూల్చివేత
  • కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ పిటిషనర్లపై ఆగ్రహం
కరోనామాత ఆలయ కూల్చివేతకు వ్యతిరేకంగా పిల్ దాఖలు చేసిన వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఒక్కొక్కరికీ రూ. 5 వేల చొప్పున జరిమానా విధించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా జుహి శుకుల్‌లో లోకేశ్ కుమార్ శ్రీవాస్తవ అనే వ్యక్తి జూన్ 7న కరోనామాత ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే, జూన్ 11న ఆలయం కూల్చివేతకు గురికావడంతో లోకేశ్ కుమార్, అతడి భార్య దీపమాల కూల్చివేతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా ఆలయం నిర్మించిన స్థలం లోకేశ్‌ది మాత్రమే కాదని, వివాదాస్పదమైన ఆ స్థలం ముగ్గురి ఉమ్మడి ఆస్తి అని తేలింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం.. వివాదాస్పద స్థలంలో ఆలయాన్ని నిర్మించడమే కాకుండా కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు గాను రూ. 5 వేల చొప్పున జరిమానా విధించింది. నాలుగు వారాల్లోగా ఆ సొమ్మును సుప్రీంకోర్టు న్యాయవాదుల సంక్షేమ నిధికి జమచేయాలని ఆదేశించింది.


More Telugu News