భారత్ బయోటెక్ నుంచి మలేరియా టీకా.. జీఎస్‌కేతో కలిసి ఉత్పత్తి!

  • ప్రపంచంలోనే తొలి మలేరియా వ్యాక్సిన్
  • జనవరిలోనే రెండు కంపెనీల మధ్య ఒప్పందం
  • మార్కెట్లోకి రావడానికి మరో రెండేళ్లు
కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్‌ను అభివృద్ధి చేసి ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ త్వరలోనే మలేరియా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుంది. ప్రముఖ ఫార్మా దిగ్గజం గ్లాక్సోస్మిత్ క్లైన్ (జీఎస్‌కే) ప్రపంచంలోనే తొలి మలేరియా టీకాను ఉత్పత్తి చేయగా, దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం కూడా లభించింది. ఇప్పుడు ఈ వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ ఉత్పత్తి చేయనున్నట్టు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ హెడ్ (బిజినెస్ డెవలప్‌మెంట్) రేచస్ ఎల్ల తెలిపారు. అయితే, ఈ వ్యాక్సిన్ మార్కెట్‌లోకి అందుబాటులోకి రావడానికి మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉంది.

మలేరియా టీకా ఆర్‌టీఎస్, ఎస్/ఎఎస్ 01ఈ1 ( RTS, S/AS01E1) జీఎస్‌కేతో ఉత్పత్తి బదిలీ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ఈ ఏడాది జనవరిలోనే భారత్ బయోటెక్ ప్రకటించింది. ఇందులో భాగంగా మలేరియా వ్యాక్సిన్ ఎస్ యాంటిజెన్ కాంపోనెంట్‌ను ఉత్పత్తి చేయడానికి ఆర్‌టీఎస్ తయారీ సాంకేతికతను భారత్ బయోటెక్‌కు బదిలీ చేస్తుంది. అలాగే, అందుకు అవసరమైన లైసెన్స్‌ను కూడా అందిస్తుంది.


More Telugu News