అభివృద్ధిని అడ్డుకునే వారు ఎవరైనా నాకు బద్ధశత్రువులే!: పవన్ కల్యాణ్

  • తెలంగాణ జనసేన క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం
  • హాజరైన పవన్ కల్యాణ్
  • తెలంగాణ స్ఫూర్తితోనే పార్టీ స్థాపించినట్టు వెల్లడి
  • తెలంగాణ స్ఫూర్తి గుండెల్లో ధైర్యాన్ని నింపిందని వ్యాఖ్యలు
జనసేన పార్టీ తెలంగాణ విభాగం క్రియాశీలక కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ స్ఫూర్తి తన గుండెల్లో ధైర్యాన్ని నింపిందని అన్నారు. తెలంగాణ పోరాట స్ఫూర్తే జనసేన పార్టీని స్థాపించేలా చేసిందని, ఉద్యమ విద్యుత్ ను తనలో ప్రవహింపజేసిందని పేర్కొన్నారు. ప్రపంచం మారాలి, సమాజం మారాలని కోరుకుంటామని, కానీ ఎందులోనైనా అడుగుపెడితే తప్ప అనుభవం రాదని పవన్ అభిప్రాయపడ్డారు.

"గెలుస్తామో, ఓడిపోతామో నాకు తెలియదు. నేను రాజకీయాల్లోకి వస్తుంటే భయపెట్టారు. మార్పు కోసం, బలమైన సామాజిక చైతన్యం కోసం రాజకీయాల్లోకి వచ్చాను. డబ్బులతో కొనలేని కొత్త తరాన్ని రాజకీయాల్లోకి తేవాలన్నది నా ఆశయం. రాజకీయాల్లో నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పని. అయితే అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను.

కులం, మతం, రంగు, ప్రాంతం మనకు తెలియకుండా జరిగిపోయే అంశాలు. రాజకీయాల్లో వాటి ప్రస్తావన ఉండకూడదు. కులాలను రెచ్చగొట్టాలని ఏనాడూ ప్రయత్నించలేదు. ఏపీలో అభివృద్ధి దిగజారిపోయింది. అభివృద్ధి నిరోధకులు ఎవరైనా సరే నాకు బద్ధ శత్రువులే" అని వ్యాఖ్యానించారు.


More Telugu News