డ్రగ్స్ కేసు: ముంబై ఆర్థర్ రోడ్ జైలుకు ఆర్యన్‌ఖాన్.. మిగతా ఖైదీల్లానే జైలు భోజనం!

  • క్రూయిజ్ నౌకలో రేవ్ పార్టీ సందర్భంగా పట్టుబడిన ఆర్యన్
  • బెయిల్ నిరాకరించిన కోర్టు
  • ఆర్థర్ రోడ్ జైలులోని బ్యారక్ నంబర్ 1 కేటాయింపు
  • ప్రస్తుతానికి ఇంటి భోజనం లేనట్టే
ముంబై తీరంలోని క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్ పార్టీలో దొరికి డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ 14 రోజులపాటు జుడీషియల్ కస్టడీలో ఉండనున్నాడు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను ముంబై చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు కొట్టివేస్తూ 14 రోజుల జుడీషియల్ కస్టడీకి పంపింది.

ఈ నేపథ్యంలో ఆర్యన్‌ను ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. జైలులోని మొదటి అంతస్తులో ఉన్న బ్యారక్ నంబర్ వన్‌ను కేటాయించారు. దీనిని క్వారంటైన్ సెల్‌గా ఉపయోగిస్తున్నారు. ఆర్యన్ ఇందులో ఐదు రోజులపాటు క్వారంటైన్‌లో ఉంటాడు.  

ఆర్యన్‌ ను కూడా ఇతర ఖైదీల్లానే పరిగణిస్తామని జైలు అధికారులు ఇది వరకే తెలిపారు. దీని ప్రకారం ఆర్యన్ తెల్లవారుజామున 6 గంటలకే నిద్ర లేవాల్సి ఉంటుంది. ఏడు గంటలకు బ్రేక్‌ఫాస్ట్, 11 గంటలకు లంచ్, సాయంత్రం ఆరు గంటలకు డిన్నర్ ఉంటుంది.

బ్రేక్‌ఫాస్ట్‌లో సాధారణంగా షీరా పోహా అందిస్తారు. మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో చపాతి, కూర, పప్పు, అన్నం వడ్డిస్తారు. ఆర్యన్ కూడా ఇవే తినాల్సి ఉంటుంది. కోర్టు నుంచి ఆదేశాలు వస్తే తప్ప ఇంటి నుంచి భోజనం అందే పరిస్థితి లేదు. అయితే, జైలు క్యాంటీన్ నుంచి డబ్బులు చెల్లించి ఇష్టమైన ఆహార పదార్థాలు కొనుగోలు చేసుకునేందుకు మాత్రం అనుమతి ఉంది.


More Telugu News