బల్మూరి వెంకట్‌ను హుజూరాబాద్ బరిలోకి కాంగ్రెస్ ఎందుకు దింపిందో చెప్పిన రేవంత్

  • కేసీఆర్, ఈటల మధ్య ఉన్నది పైసల పంచాయితీ
  • హరీశ్‌రావు-ఈటల ఇద్దరూ తోడు దొంగలు
  • తెలంగాణ అమరవీరుల ఆత్మగౌరవం కోసమే బరిలోకి వెంకట్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ నేత, హుజూరాబాద్ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వారేమీ ప్రజా సమస్యల కోసం కొట్లాడడం లేదని, వారిమధ్య ఉన్నది పైసలు, ఆస్తుల పంచాయితీ అని ఆరోపించారు. ఈటల మంత్రి పదవిని ఊడగొట్టి కేసీఆర్ గెలిస్తే, కేసులు కాకుండా బీజేపీలో చేరి ఈటల గెలిచారని అన్నారు. అయితే, వీరిద్దరి చేతుల్లో ఓడింది మాత్రం ప్రజలేనని ఆవేదన వ్యక్తం చేశారు.

 హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి  బల్మూరి వెంకట్ నామినేషన్ సందర్భంగా నిన్న ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ మాట్లాడారు. తెలంగాణ అమరవీరుల ఆత్మగౌరవం కోసమే వెంకట్‌ను బరిలోకి దింపినట్టు చెప్పారు. హరీశ్‌రావు, ఈటల ఇద్దరూ తోడుదొంగలేనని, ఇద్దరి మధ్య ఇప్పటికీ వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. అయినా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటారని అన్నారు.

హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. గతంలో నమ్మి టికెట్ ఇస్తే ఆ వ్యక్తి కార్యకర్తల గుండెలపై తన్ని ఎదుటి పార్టీలోకి వెళ్లాడని కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. అయినప్పటికీ ఎమ్మెల్సీ పదవి దక్కకుండా తగిన శాస్తి జరిగిందని రేవంత్ అన్నారు.


More Telugu News