దసరా రద్దీని సొమ్ము చేసుకుంటున్న రైల్వే.. ప్రత్యేకం పేరుతో భారీగా వడ్డింపు!

  • హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు పయనమవుతున్న కార్మికులు, ఉద్యోగులు
  • హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్లు
  • రైలు, క్లాస్‌ను బట్టి ఒక్కో ప్రయాణికుడిపై గరిష్ఠంగా రూ. 700 వరకు అదనపు వసూలు
దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వేశాఖ  ప్రయాణికులపై ఎనలేని భారం మోపుతోంది. ప్రత్యేక రైళ్లు, తత్కాల్ పేరుతో ప్రయాణికులు భరించలేనంతగా చార్జీలు వసూలు చేస్తోంది. రైల్వే తాజా నిర్ణయంతో రైలు, ప్రయాణం చేసే క్లాస్‌ను బట్టి ఒక్కో ప్రయాణికుడిపై అదనంగా రూ. 200 నుంచి రూ. 700 వరకు భారం పడుతోంది.

దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు సొంత రాష్ట్రాలకు పయనమవుతున్నారు. దీంతో అనూహ్యంగా పెరిగిన రద్దీని తట్టుకునేందుకు రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఈ రైళ్ల టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

ఈ నెల 14న హైదరాబాద్-విశాఖపట్టణం గరీభ్ రథ్ రైలు టికెట్లన్నీ కొన్ని గంటల్లోనే అమ్ముడుపోగా, 142 మంది ఇంకా వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. అదే రోజు హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు 16 రైళ్లు వెళ్లనుండగా రెండు, మూడు మినహా అన్నింటిలోనూ టికెట్లు అయిపోయాయి.


More Telugu News