మేనిఫెస్టో విడుదల చేసిన మంచు విష్ణు... వివరాలు ఇవిగో!
- అక్టోబరు 10న మా ఎన్నికలు
- మేనిఫెస్టోను మీడియా ముందుంచిన విష్ణు
- తమది ఒకే కుటుంబం అని వెల్లడి
- తమను ఆశీర్వదించాలని విజ్ఞప్తి
మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న మంచు విష్ణు తన ప్యానెల్ మేనిఫెస్టో విడుదల చేశారు. తాము గెలిస్తే ఏమేం చేస్తారో వివరించి మా సభ్యులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించిన మంచు విష్ణు మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను మాత్రమే వివరించారు. అన్ని వివరాలు తెలిపితే ఎంతో సమయం పడుతుందని, మీడియా మిత్రులకు అంత సమయం ఉండదు కాబట్టి, ప్రధాన అంశాలను వివరిస్తానని తెలిపారు.
- నటీనటులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి. ఇందుకోసం ప్రత్యేకంగా మా యాప్ కు రూపకల్పన. డైరెక్టర్లు, నిర్మాతలు, రచయితలు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ ను ఈ యాప్ తో అనుసంధానం చేస్తాం.
- ప్రత్యేకంగా జాబ్ కమిటీ ఏర్పాటు. నిర్మాతలు, నిర్మాణ సంస్థలు, ఓటీటీ వేదికల వద్దకు వెళ్లి తమ జాబితాలో ఉన్న నటీనటులకు అవకాశాలు ఇచ్చేలా ఈ జాబ్ కమిటీ ప్రయత్నాలు చేస్తుంది. అవకాశాలు లేని నటీనటులకు ప్రాధాన్యం.
- నా సొంత డబ్బుతో మా భవనం నిర్మిస్తాం. మా భవనం కోసం మూడు స్థలాలు చూశాం.
- నటీనటుల సొంత ఇంటి కలను నెరవేరుస్తాం. ప్రభుత్వంతో మాట్లాడి మా సభ్యులకు సొంత ఇల్లు ఇప్పించే హామీ నాది.
- మాలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచిత ఆరోగ్య బీమా. ఇప్పటివరకు సగం వాటా మా, మరో సగం వాటా సభ్యుడు కట్టాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరంలేదు. ఆరోగ్య బీమా పూర్తి ఉచితంగా కల్పిస్తాం. బీమా మొత్తాన్ని రూ.3 లక్షల కంటే అధికంగా అందిస్తాం. ఇన్సూరెన్స్ కవరేజిని మరింత విస్తరిస్తాం. ఐదారుగురు ఉన్న కుటుంబానికి కూడా బీమా సౌకర్యం. ఇప్పటికే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ఆసుపత్రులతో మాట్లాడాం.
- అర్హుడైన ప్రతి సభ్యుడి పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు సహకారం అందిస్తాం. ఉపకారవేతనాలపై చర్చలు జరుగుతున్నాయి.
- అర్హులైన సభ్యులకు పెళ్లి ఖర్చుల కోసం రూ.1,16,000 వరకు సాయం చేస్తాం.
- మహిళల రక్షణ కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు. ఇలాంటి గ్రీవెన్స్ సెల్ టాలీవుడ్ లో ఇదే ప్రథమం. మహిళా సభ్యుల భద్రత, ఆర్థిక భరోసా కోసం అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఎంతోమంది తెలుగు నటీమణులు ఇండస్ట్రీకి రావాల్సి ఉంది. వాళ్లందరికీ మెరుగైన వాతావరణం కల్పిస్తాం.
- వృద్ధ కళాకారులకు ఇప్పుడిస్తున్న రూ.6 వేల పెన్షన్ ను మరింత పెంచుతాం.
- 'మా'లో ఉన్న కొందరికి ఓటు హక్కులేదు. మేం అధికారంలోకి వస్తే వారందరికీ ఓటు హక్కు కల్పిస్తాం.
- కరోనా వల్ల మా అందరికీ ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో కొత్త కళాకారులు మాలో సభ్యత్వం కోరుకుంటే ఇప్పటివరకు అమలు చేసిన లక్ష రూపాయల ఫీజు స్థానంలో రూ.70 వేలే వసూలు చేస్తాం.
- మా తరఫున తెలుగు సినీ ఉత్సవాలు నిర్వహిస్తాం.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు నటీనటులందరం అర్హులమే అయినా, చాలామందికి వాటిని ఎలా పొందాలో తెలియదు. అందరికీ పథకాలు చేరేందుకు చర్యలు తీసుకుంటాం.
- మోహన్ బాబు పేరిట ఫిలిం ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే జూన్ లో ఇది ప్రారంభం కానుంది. కళాకారులు ఎంతోమంది తమ పిల్లలను 24 క్రాఫ్ట్స్ లో ఒకదాంట్లో శిక్షణ ఇప్పించాలనుకుంటే వారికి తోడ్పాటు అందిస్తాం. మోహన్ బాబు ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో వారికి 50 శాతం రాయితీ కల్పిస్తాం. ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న ఇతర ఫిలిం ఇన్ స్టిట్యూట్లతోనూ మాట్లాడాం. వారందరితో కలిసి మా సభ్యుల కోసం ఓ స్కాలర్ షిప్ ఏర్పాటు చేస్తున్నాం.
- మేం గెలిచిన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రులను కలుస్తాం. తెలుగు సినీ రంగ సమస్యలను పరిష్కరించాలని వారిని కోరతాం.