డ్రగ్స్ వ్యవహారంలో కేంద్ర, రాష్ట్రాలకు భాగం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి: మాజీ ఎంపీ హర్షకుమార్

  • డ్రగ్స్ అంశం చుట్టూ ఏపీ రాజకీయాలు
  • నేతల పరస్పర ఆరోపణలు
  •  
  • ఎన్ఐఏ విచారణకు డిమాండ్
 ఏపీలో కాకరేపుతున్న డ్రగ్స్ వ్యవహారంలో మాజీ ఎంపీ హర్షకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాదకద్రవ్యాల అంశంలో కేంద్ర, రాష్ట్రాలకు భాగం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ఇటీవల హెరాయిన్ పట్టుబడిన ముంద్రా పోర్టు అదానీ చేతుల్లో ఉందని, కాకినాడ పోర్టు విజయసాయి చేతుల్లో ఉందని వివరించారు. రూ.72 వేల కోట్ల హెరాయిన్ ప్రజల్లోకి వెళితే పట్టించుకోరా? అని హర్షకుమార్ ప్రశ్నించారు. హెరాయిన్ పోర్టులు దాటి వస్తే కేంద్రానికి తెలియదా? అని నిలదీశారు. కేంద్ర, రాష్ట్ర పెద్దలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

శాన్ మెరైన్ ఎండీ అలీషాను ఎందుకు అరెస్ట్ చేయడంలేదో చెప్పాలన్నారు. శాన్ మెరైన్ ఎండీ అలీషా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడికి కుడిభుజం లాంటివాడని తెలిపారు. అరెస్టయిన సుధాకర్... అలీషా వద్ద పనిచేస్తున్నాడని హర్షకుమార్ వెల్లడించారు. డ్రగ్స్ అంశంలో సజ్జల అన్నీ అబద్ధాలే చెబుతున్నారని ఆరోపించారు. సజ్జల వ్యాఖ్యలు చూస్తుంటే ప్రభుత్వానికి కూడా డ్రగ్స్ వ్యవహారంలో భాగం ఉన్నట్టు భావించాల్సి వస్తోందని పేర్కొన్నారు.


More Telugu News