హైదరాబాద్‌ను 141 పరుగులకు కట్టడి చేసిన బెంగళూరు

  • రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించిన జేసన్ రాయ్-విలియమ్సన్
  • 105/3తో పటిష్ఠంగా కనిపించిన ఎస్ఆర్‌హెచ్
  • హర్షల్ పటేల్ విజృంభణతో వరుసపెట్టి వికెట్లు కోల్పోయిన వైనం
అబుదాబిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న ఐపీఎల్ 52వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 14 పరుగుల వద్ద అభిషేక్ శర్మ (13) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో కలిసి ఓపెనర్ జేసన్ రాయ్ నిలకడగా ఆడాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించాడు.

ఈ క్రమంలో 29 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసిన విలియమ్సన్.. హర్షల్ పటేల్ బౌలింగులో బౌల్డయ్యాడు. అప్పటికి 84 పరుగులతో పటిష్ఠంగా కనిపించింది. అయితే, 105 పరుగుల వద్ద ప్రియం గార్గ్ (15) అవుటైన తర్వాత మ్యాచ్ స్వరూపం మారిపోయింది. వరుసపెట్టి వికెట్లు కోల్పోతూ భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది.

జేసన్ రాయ్ 44 పరుగులు చేసి అవుట్ కాగా, సమద్ (1), సాహా (10), హోల్డర్ (16) క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. దీంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ 141/7 వద్ద ముగిసింది. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా, డేనియల్ క్రిస్టియన్ 2, చాహల్, గార్టన్ చెరో వికెట్ తీసుకున్నారు.


More Telugu News