లఖింపూర్ ఖేరీ హింసలో మరణించిన రైతు కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం

  • ప్రకటించిన పంజాబ్, చత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు
  • బాధిత రైతు కుటుంబాలతో పాటు జర్నలిస్టు కుటుంబానికీ పరిహారం
  • లఖింపూర్‌ ఖేరీ సందర్శించేందుకు రాహుల్‌, ప్రియాంకకు అనుమతి
కేంద్రమంత్రి అజయ్ మిశ్రా పర్యటన సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో చోటుచేసుకున్న హింసలో మరణించిన నలుగురు రైతు కుటుంబాలకు చత్తీస్‌గఢ్, పంజాబ్ ప్రభుత్వాలు రూ. 50 లక్షల చొప్పున వేర్వేరుగా పరిహారం ప్రకటించాయి.

ఈ సందర్భంగా లక్నోలో మీడియాతో మాట్లాడిన పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ.. లఖింపూర్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఈ ఘటనలో మరణించిన రైతులతోపాటు జర్నలిస్టు కుటుంబానికి పరిహారం అందిస్తామన్నారు.

చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం తరపున లఖింపూర్ హింసలో మరణించిన రైతు కుటుంబాలతో పాటు జర్నలిస్టు కుటుంబానికి రూ. 50 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు తెలిపారు. ఈ రెండూ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు కావడం గమనార్హం.

కాగా, లఖింపూర్‌ ఖేరీ సందర్శనలో భాగంగా ఈ ఉదయం పంజాబ్, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు, నేతలు కేసీ వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలతో కలిసి రాహుల్ గాంధీ లక్నో చేరుకున్నారు. మరోవైపు, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీతోపాటు మరో ముగ్గురు నేతలు లఖింపూర్‌ ఖేరీని సందర్శించేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.


More Telugu News