బీజేపీని వీడుతూ... గుండు కొట్టించుకున్న ఎమ్మెల్యే!

  • బీజేపీపై త్రిపుర ఎమ్మెల్యే ఆశిష్ మండిపాటు
  • త్రిపుర‌లో అరాచ‌కాల‌కు పాల్పడుతోంద‌ని వ్యాఖ్య‌
  • టీఎంసీలో చేర‌నున్న ఆశిష్
ఇన్నాళ్లూ బీజేపీలో కొన‌సాగి అదే పార్టీ నుంచి గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి త్రిపుర‌లోని సుర్మా నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన‌ ఆశిష్‌ దాస్ తృణ‌మూల్ కాంగ్రెస్‌లో చేరాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. బీజేపీని వీడుతోన్న క్ర‌మంలో ఇన్నాళ్లూ ఆ పార్టీలో ఉన్నందుకు పాప ప‌రిహారంగా గుండు కొట్టించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

త్రిపుర‌లో బీజేపీ పాల‌న స‌రిగా లేద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న మండిప‌డ్డారు. బీజేపీ చేసిన త‌ప్పుల‌కు తాను కోల్‌క‌తాలోని కాళీఘా‌ట్ ఆల‌యం వ‌ద్ద గుండు కొట్టించుకుంటున్న‌ట్లు చెప్పారు. త్రిపుర‌లో బీజేపీ అరాచ‌కాలకు పాల్ప‌డుతోంద‌ని ఆరోపించారు. త్వ‌ర‌లోనే తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌ల ప‌శ్చిమ బెంగాల్ లోని భ‌వానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ విజ‌యం సాధించ‌డం ప‌ట్ల ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు.  

  



More Telugu News