జూనియర్ రెజ్లర్ హత్యకేసు.. సుశీల్ కుమార్‌కు బెయిల్ తిరస్కరణ

  • సాగర్ ధనకర్ హత్యకేసులో అరెస్ట్ అయిన సుశీల్ కుమార్
  • జూన్ 2 నుంచి జైలులోనే
  • సాగర్‌ను అడవి పందిని వేటాడినట్టు వేటాడారన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్
  • సుశీల్ కుమార్‌ను కావాలనే ఇరికిస్తున్నారన్న ఆయన తరపు న్యాయవాది
జూనియర్ రెజ్లర్ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్‌ బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. ఈ ఏడాది మే 4న జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్‌కర్‌ను హత్య చేసినట్టు సుశీల్‌పై అభియోగాలు నమోదయ్యాయి. ఢిల్లీ పోలీసులు తాజాగా కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్‌‌లో పలు అభియోగాలు మోపారు. ఈ మొత్తం కుట్రలో సుశీల్ కుమారే కీలక సూత్రధారి అని అందులో పేర్కొన్నారు.

సుశీల్ కుమార్ బెయిలు పిటిషన్‌‌పై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. బాధితుడు సాగర్ ధనకర్‌ను నిందితుడు సుశీల్ కుమార్ అడవి జంతువును వేటాడినట్టు వేటాడాడని, అడవి పందిని చంపినట్టు దారుణంగా కొట్టి చంపాడని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ కుమార్ శ్రీవాస్తవ ఆరోపించారు. సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇవ్వొద్దని అభ్యర్థించారు.

 సుశీల్ కుమార్ తరపు కోర్టుకు హాజరైన సుశీల్ రాణా తన వాదనలు వినిపిస్తూ తన క్లయింట్‌ను కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారని అన్నారు. సుశీల్‌కు వ్యతిరేకంగా ఏ ఒక్కరు వాంగ్మూలం ఇవ్వలేదన్నారు. సాగర్ ధన్‌కర్ మరణ వాంగ్మూలాన్ని 40 రోజులు ఆలస్యంగా కోర్టుకు సమర్పించారని తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడు సుశీల్ కుమార్‌కు బెయిలు ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా, సుశీల్ కుమార్ జూన్ 2 నుంచి జైలులో ఉంటున్నాడు.  


More Telugu News