పీఎం ఆవాస్ యోజన కింద కట్టిన ఇళ్లలో 80 శాతం మహిళల పేరిటే: ప్రధాని మోదీ
- 75 వేల మందికి వర్చువల్‌గా పీఎంఏవై ఇంటి తాళాలు అందించిన మోదీ
- 2014 నుంచి 1.13 కోట్ల గృహాలు మంజూరైనట్లు ప్రకటన
- 50 లక్షల గృహాల నిర్మాణం కూడా పూర్తయిందని వెల్లడి
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన భవనాల్లో 80 శాతం మహిళల పేరునే ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లేదంటే మహిళలను సమయజమానులుగా చేర్చామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన 75 వేల ఇళ్ల తాళాలను ఆయన వర్చువల్‌గా లబ్దిదారులకు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2014 నుంచి దేశవ్యాప్తంగా పీఎంఏవై పథకం కింద 1.13 కోట్ల గృహాల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చామని ఆయన తెలిపారు. వీటిలో 50 లక్షలపైగా భవనాల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని వెల్లడించారు. గత ప్రభుత్వాలు అంటే 2014 ముందు కేవలం 13 లక్షల అర్బన్ గృహాలను మాత్రమే మంజూరు చేశాయని, వాటిలో 8 లక్షలు మాత్రమే నిర్మించారని చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లోని 75 జిల్లాల్లో ఉన్న 75 వేల లబ్ధిదారులకు ఆయన వర్చువల్‌గా ఇంటి తాళాలను అందించి, వారితో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితోపాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాత్ పాల్గొన్నారు