ప్రకాశ్ రాజ్ మగాడైతే, దమ్ముంటే నన్ను ఎదుర్కోవాలి... ఇంకోసారి నా కుటుంబం పేరు ఎత్తితే బాగుండదు!: మంచు విష్ణు

  • మంచు విష్ణు ప్రెస్ మీట్
  • 'మా' ఎన్నికల నేపథ్యంలో నిప్పులు చెరిగిన విష్ణు
  • ప్రకాశ్ రాజ్, జీవిత, శ్రీకాంత్ లకు వార్నింగ్
  • విజయం తమదేనని ఉద్ఘాటన
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం ఆరోపణలు, ప్రత్యారోపణలతో భగ్గుమంటోంది. తాజాగా మంచు విష్ణు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్ పై నిప్పులు చెరిగారు. 'మా' ఎన్నికల వ్యవహారంలోకి నా కుటుంబాన్ని ఎందుకు తీసుకువస్తున్నారంటూ విష్ణు మండిపడ్డారు. ప్రకాశ్ రాజ్ మా ఇంటిని కూడా రెండుగా విభజిస్తున్నారని ఆరోపించారు. నా కుటుంబం పేరెత్తితే ప్రకాశ్ రాజ్ కు ఇక మర్యాద దక్కదని హెచ్చరించారు. నా కోసం మా నాన్న, అక్క, తమ్ముడు ఓటు అడగుతారు... అందులో తప్పేంటి? అని మంచు విష్ణు ప్రశ్నించారు.

అసలు నడిగర సంఘంలో అడిగితే ప్రకాశ్ రాజ్ నిజస్వరూపం ఏంటో తెలుస్తుందని అన్నారు. చిన్నా, పెద్దా అని చూడకుండా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతున్నారని,  పెద్దలను గౌరవించకపోతే సర్వనాశనం అవుతారని ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. ప్రకాశ్ రాజ్ మగాడైతే, దమ్ముంటే నన్ను ధైర్యంగా ఎదుర్కోవాలి! అంటూ విష్ణు సవాల్ విసిరారు. నేడు శ్రీహరి అంకుల్ మన మధ్యన ఉండుంటే ప్రకాశ్ రాజ్ కు తగిన గుణపాఠం చెప్పేవారు అని పేర్కొన్నారు. (శ్రీహరి, ప్రకాశ్ రాజ్ తోడల్లుళ్లన్న సంగతి తెలిసిందే. పైగా మోహన్ బాబుకు శ్రీహరి అత్యంత విధేయుడిగా ముద్రపడ్డారు).

ఈ సందర్భంగా మంచు విష్ణు... సీనియర్ నటి జీవితపైనా విరుచుకుపడ్డారు. జీవిత గారూ... మరోసారి మా నాన్న పేరు ఎత్తవద్దు అని స్పష్టం చేశారు. మోహన్ బాబు పేరెత్తే అర్హత జీవితకు లేదని అన్నారు. సీనియర్ నటుడు శ్రీకాంత్ కు కూడా విష్ణు వార్నింగ్ ఇచ్చారు. శ్రీకాంత్ గారూ... మీరు నోరెత్తితే బాగుండదని పేర్కొన్నారు.

"ఈ నెల 10 తర్వాత మనందరం ఒకరి ముఖం ఒకరం చూసుకోవాలి. ఈ నెల 11న ప్రకాశ్ రాజ్ విమానం ఎక్కి వెళ్లిపోతారు. సినీ కుటుంబాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తారా? ఓ ముఠాగా ఏర్పడి 'మా' కుటుంబాన్ని చీల్చుతున్నారు. డ్రామాలు ఆడుతున్న ప్రకాశ్ రాజ్ కోసమే పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు జరిపించాలని కోరాం. పోస్టల్ బ్యాలెట్ అంశంలో నా ప్రమేయం లేదు" అని విష్ణు స్పష్టం చేశారు.


More Telugu News