టీ20 ప్రపంచకప్‌లో నా చాయిస్ అతనే.. వరుణ్ చక్రవర్తిపై మాజీ వికెట్ కీపర్ కామెంట్స్
- జడేజా కాకుండా మరో స్పిన్నర్ కావాలంటే తొలి ప్రాధాన్యం వరుణ్‌కే
- ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్న స్పిన్నర్
- కేకేఆర్ తరఫున 13 మ్యాచుల్లో 15 వికెట్లు పడగొట్టిన వరుణ్
రాబోయే టీ20 ప్రపంచకప్ ఆడే భారత జట్టులో వరుణ్ చక్రవర్తిని కచ్చితంగా తీసుకోవాలని మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దీప్‌దాస్ గుప్తా అభిప్రాయపడ్డాడు. తన వేరియేషన్స్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే వరుణ్‌ను కచ్చితంగా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవాలని దీప్‌దాస్ అన్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లో అద్భుతంగా రాణించిన వరుణ్ ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన బృందంలో ఉన్నాడు.
ఈ క్రమంలో ఒక ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన దీప్‌దాస్ గుప్తా అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. రవీంద్ర జడేజా కాకుండా మరో స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకోవాలని భారత్ భావిస్తే తన ఓటు కచ్చితంగా వరుణ్‌కే అని ఈ మాజీ వికెట్ కీపర్ చెప్పాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కూడా వరుణ్ రాణిస్తున్నాడు. ఇప్పటి వరకూ కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున 13 మ్యాచులు ఆడిన అతను 15 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ రేటు కూడా 6.73 మాత్రమే. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచులో కూడా రెండు వికెట్లు కూల్చిన వరుణ్‌ను దీప్‌దాస్ గుప్తా ప్రశంసించాడు. అతన్ని కచ్చితంగా టీ20 ప్రపంచకప్‌లో ఆడే జట్టులోకి తీసుకోవాలని సూచించాడు.