ఇప్పుడప్పుడే దర్శనం టోకెన్ల సంఖ్యను పెంచబోం: టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి

  • ఈ నెల 7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
  • అప్పటి నుంచే అలిపిరి కాలినడక మార్గంలో భక్తులకు అనుమతి
  • బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్
తిరుమల భక్తులకు జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను ఇప్పుడప్పుడే పెంచే యోచన లేదని టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మహమ్మారి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని పేర్కొన్నారు. కాబట్టి ఇప్పట్లో సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచే ఉద్దేశం లేదన్నారు. కొవిడ్ పరిస్థితులపై ఈ నెలాఖరున సమీక్షించిన అనంతరం టోకెన్ల సంఖ్యపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

భక్తుల కోరిక మేరకే సర్వదర్శనం టోకెన్లు ఇవ్వడం ప్రారంభించామని, తొలుత రోజుకు రెండు వేలు ఇచ్చామని, ఆ తర్వాత వాటి సంఖ్యను 8 వేలకు పెంచినట్టు వివరించారు. పురటాసి మాసాన్ని పురస్కరించుకుని తమిళనాడు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నట్టు చెప్పారు. దీంతో కొవిడ్ నిబంధనలను అమలు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. కాబట్టే సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో జారీ చేస్తున్నామని, ఇప్పుడప్పుడే భక్తుల సంఖ్యను పెంచే ఉద్దేశం లేదని జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు.

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వ్యాక్సినేషన్ పూర్తయినట్టు సర్టిఫికెట్ కలిగి ఉండాలని, ఒక్క డోసు తీసుకున్నా దర్శనానికి అనుమతిస్తామన్నారు. ఈ నెల ఏడో తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని, అప్పటి నుంచి అలిపిరి కాలినడక మార్గంలో భక్తుల రాకకు అనుమతిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈసారి కూడా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించనున్నట్టు చెప్పిన జవహర్‌రెడ్డి.. ఉత్సవాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించినట్టు చెప్పారు.


More Telugu News