మళ్లీ ఓడిన సన్‌రైజర్స్.. ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు కోల్‌కతా

  • 12 మ్యాచుల్లో పదింటిలో ఓడి అట్టడుగున హైదరాబాద్
  • కోల్‌కతా బౌలర్లకు తలవంచిన హైదరాబాద్ బ్యాట్స్‌మెన్
  • అర్ధ సెంచరీతో రాణించిన గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు
యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ రెండో భాగంలో ఇప్పటికే మూడు జట్లు.. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లే ఆఫ్స్‌లో స్థానం సంపాదించుకోగా, మిగిలిన స్థానం కోసం జరుగుతున్న పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందంజలో ఉంది. గత రాత్రి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు, ఆడిన 12 మ్యాచుల్లో పదింటిలో ఓడిన హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది.

హైదరాబాద్ తమ ముందు ఉంచిన 116 పరుగుల స్వల్ప విజయ లక్ష్యాన్ని కోల్‌కతా నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (57),  నితీశ్ రాణా (25), దినేశ్ కార్తీక్ (18) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో జేసన్ హోల్డర్‌కు రెండు, రషీద్ ఖాన్, సిద్దార్థ్ కౌల్‌కు చెరో వికెట్ దక్కాయి.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులు మాత్రమే చేసింది. కోల్‌కతా బౌలర్లు విసిరే బంతులకు బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. కెప్టెన్ విలియమ్సన్ (26), ప్రియమ్ గార్గ్ (21), అబ్దుల్ సమద్ (25) కాస్తయినా రాణించడంతో హైదరాబాద్ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో సౌథీ, శివమ్ మావీ, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు తీసుకోగా, షకీబ్‌కు ఒకటి దక్కింది. అర్ధ సెంచరీతో అదరగొట్టిన శుభ్‌మన్‌ గిల్‌కు ‘ప్లేయర్ ది ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఐపీఎల్‌లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య దుబాయ్‌లో రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ జరుగుతుంది.


More Telugu News