కుట్రదారులకు భవానీపూర్ గట్టి జవాబిచ్చింది: మమతాబెనర్జీ

  • భవానీపూర్ ఉప ఎన్నికలో మమతా బెనర్జీ విజయం
  • నందిగ్రామ్ లో కుట్రలు పన్నారని ఆరోపణ
  • భవానీపూర్ ప్రజలు దీటుగా బదులిచ్చారని వెల్లడి
  • భవానీపూర్ ప్రజలకు రుణపడి ఉంటానని వ్యాఖ్యలు
భవానీపూర్ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన అనంతరం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. నందిగ్రామ్ లో తనపై పన్నిన కుట్రలకు భవానీపూర్ ఓటర్లు దీటైన జవాబిచ్చారని పేర్కొన్నారు. తనకు ఎంతో విలువైన విజయాన్ని కట్టబెట్టిన భవానీపూర్ ప్రజలకు రుణపడి ఉంటానని వినమ్రంగా తెలిపారు.

"భవానీపూర్ ప్రజలందరికీ కృతజ్ఞతలు. భారత జాతీయులైన అక్కలు, చెల్లెమ్మలు, తల్లులు, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. 2016లో నాకు ఇక్కడ కొన్ని వార్డుల్లో చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇక్కడి ఓటర్లలో 46 శాతం బెంగాలేతరులే. ప్రతి ఒక్కరూ నాకు ఓటేశారని భావిస్తున్నా" అని వివరించారు.

పశ్చిమ బెంగాల్ లోని భవానీపూర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. దీన్ని మినీ భారత్ అని పిలుస్తారు. ఇక్కడ గుజరాతీలు, పంజాబీలు, మార్వాడీలు, బీహారీలు అత్యధిక సంఖ్యలో ఉంటారు. 40 శాతానికి పైగా జనాభా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారే.

బెంగాల్ లో ఎన్నికలు ప్రారంభమైంది మొదలు... తనకు వ్యతిరేకంగా కేంద్రం కుట్రలు పన్నుతూనే ఉందని మమత ఆరోపించారు. తమను అధికారం నుంచి దించడమే కేంద్రం లక్ష్యమని తెలిపారు. ఈ పరిణామాల్లో తన కాళ్లకు కూడా గాయాలయ్యాయని ఆమె వివరించారు. ఈ క్రమంలో తాను మళ్లీ సీఎంగా కొనసాగేందుకు సహకరించిన ప్రజానీకం పట్ల సర్వదా విధేయురాలినై ఉంటానని, ఆర్నెల్ల లోపు ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించిన భారత ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని మమత వెల్లడించారు.


More Telugu News