అతనో క్లాస్ ప్లేయర్‌.. సెంచరీ హీరో రుతురాజ్‌పై చెన్నై కోచ్‌ ప్రశంసలు

  • అతనిపై మా నమ్మకం ఇప్పుడు అందరికీ అర్థమవుతుందన్న స్టీఫెన్ ఫ్లెమింగ్
  • రాజస్థాన్‌తో మ్యాచులో 60 బంతుల్లో సెంచరీ చేసిన రుతురాజ్‌
  • అతన్ని చూస్తే ధోనీలా అనిపిస్తాడని కొన్నిరోజుల క్రితం ఊతప్ప కితాబు
చెన్నై సూపర్ కింగ్స్ యువ బ్యాట్స్‌మెన్ రుతురాజ్‌ గైక్వాడ్‌పై ఆ జట్టు హెడ్‌ కోచ్‌ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతనో క్లాస్ ప్లేయర్‌ అంటూ మెచ్చుకున్నాడు. రుతురాజ్‌పై తమకు భారీ అంచనాలున్నాయని, అలా ఎందుకున్నాయో ఇప్పుడు మిగతా వారికి అర్థమవుతుందని ఫ్లెమింగ్ అన్నాడు. రుతురాజ్ సెంచరీ చేసినా జట్టు ఓడిపోవడం దురదృష్టమే అయినా, అతని ఇన్నింగ్స్‌ను జట్టు మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుందని స్పష్టం చేశాడు. కొన్నిరోజుల క్రితం ట్విట్టర్‌లో షేర్ చేసిన ఒక వీడియోలో వెటరన్ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఊతప్ప కూడా రుతురాజ్‌ను మెచ్చుకున్నాడు.

అతన్ని చూస్తే ధోనీ గుర్తొస్తాడని కితాబిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్‌లో అత్యథిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌కు లభించే ఆరెంజ్‌ క్యాప్‌ ప్రస్తుతం రుతురాజ్‌కు దక్కింది. మొత్తం 508 పరుగులతో అతను ఆరెంజ్‌ క్యాప్ అందుకున్నాడు. ఈ సీజన్‌లో 12 మ్యాచులు ఆడిన చెన్నై జట్టు 9 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కాగా, రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ అద్భుతంగా రాణించాడు. 60 బంతులెదుర్కొన్న ఈ 24 ఏళ్ల ఓపెనర్ 101 పరుగులు సాధించాడు.

20వ ఓవర్ చివరి బంతికి సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో చెన్నై జట్టు స్కోరు 189 పరుగులకు చేరింది. కానీ రాజస్థాన్‌ ఓపెనర్ యశస్వి జైస్వాల్, శివమ్ దూబేలు కూడా సూపర్ ఇన్నింగ్స్‌లు ఆడటంతో మ్యాచ్ చెన్నై చెయ్యిజారింది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ ఆరో స్థానంలో ఉంది.


More Telugu News