అన్ని వేరియంట్లనూ అణచివేస్తున్న మెర్క్ కొవిడ్ ట్యాబ్లెట్.. గొప్ప ముందడుగు అంటున్న శాస్త్రవేత్తలు

  • మోల్నుపిరావిర్ ఫేజ్ 3 ట్రయల్స్ లో మంచి ఫలితాలు
  • మరణాల ముప్పు, ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం సగానికి తగ్గుదల
  • అమెరికా ప్రభుత్వానికి సరఫరా చేయనున్న మెర్క్
  • 17 లక్షల కోర్సుల పంపిణీకి ఒప్పందం
కరోనాకు ఇప్పటికే వ్యాక్సిన్లు వచ్చాయి. అవి రాకముందు ఫావిపిరావిర్, రెమ్డెసివిర్ వంటి మందులను వాడారు. అవి ప్రభావవంతంగానే పనిచేసినా.. ఆ తర్వాత వాటితో ఎన్నో దుష్ప్రభావాలు కలుగుతున్నాయని గుర్తించారు. తాజాగా అమెరికాకు చెందిన మెర్క్ అనే సంస్థ మోల్నుపిరావిర్ అనే మాత్రను తయారు చేసింది. దానిని వందలాది మందిపై ప్రయోగించి పరీక్షించింది.

ఆ పరీక్షల్లో కరోనాలోని అన్ని వేరియంట్లనూ మోల్నుపిరావిర్ అణచివేస్తున్నట్టు తేలిందని మెర్క్ ప్రకటించింది. మరణాల ముప్పును, ఆసుపత్రి పాలయ్యే ముప్పును సగానికి తగ్గించిందని పేర్కొంది. రిడ్జ్ బ్యాక్ బయో థెరప్యుటిక్స్ అనే సంస్థతో కలిసి తయారు చేసిన ఆ ఔషధాన్ని అతి త్వరలోనే అమెరికా మార్కెట్ లోకి విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టు కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.

ఔషధానికి సంబంధించిన ఫేజ్ 3 ట్రయల్స్ ను విశ్లేషించిన నిపుణులు దాని పనితీరు చాలా బాగుందని తేల్చారు. ట్రయల్స్ లో భాగంగా నిజమైన ట్యాబ్లెట్, ప్లాసిబో (డమ్మీ మందు) ఇచ్చిన వాళ్లలో ఒకేరకమైన ఫలితాలు కనిపించాయని, దుష్ప్రభావాలూ తక్కువేనని చెబుతున్నారు. కరోనాతో పోరులో ఇదో అతిపెద్ద ముందడుగు అని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ ప్రొఫెసర్ పీటర్ హార్బీ అన్నారు. కాగా, ఒక్క కోర్సు ఔషధానికి 700 డాలర్ల చొప్పున 17 లక్షల కోర్సుల ట్యాబ్లెట్ల సరఫరాకు అమెరికా ప్రభుత్వం మెర్క్ తో ఒప్పందం చేసుకుంది.


More Telugu News