నాపై ప్రజల్లో నమ్మకం పోలేదు.. కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు: అమరీందర్ సింగ్

  • 2017 నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ గెలిచానన్న మాజీ సీఎం 
  • తప్పంతా సిద్ధూ, అతని అనుచరులదేనని వ్యాఖ్య 
  • సంక్షోభాన్ని దాచడానికి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌పై ఫైర్
ప్రజలకు తనపై నమ్మకం ఏమాత్రం తగ్గలేదని, కాంగ్రెస్ నేతలు కావాలనే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ మండిపడ్డారు. 2017 నుంచి రాష్ట్రంలో జరిగిన ఏ ఎన్నికలోనూ తాను ఓడిపోలేదని అమరీందర్ అన్నారు. పంజాబ్‌ కాంగ్రెస్‌లో వర్గపోరు తీవ్రతరమైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం సీఎం పదవికి రాజీనామా చేసిన అమరీందర్, తాజాగా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ కూడా తన చీఫ్ పదవికి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు పంజాబ్‌లో కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఈ క్రమంలో మాట్లాడిన అమరీందర్, సిద్ధూ వర్గంపై మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సిద్ధూ, అతని సహచరులే కారణమని అమరీందర్ తేల్చిచెప్పారు. కానీ ఇంకా పార్టీ అధిష్ఠానం వారి మాటలు ఎందుకు నమ్ముతుందో తనకు అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్టీలోని సంక్షోభాన్ని కప్పిపుచ్చేందుకు కాంగ్రెస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.


More Telugu News