పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యంత గొప్ప సారధి.. ధోనీకి కితాబునిచ్చిన రవిశాస్త్రి

  • అతని ఖాతాలో అన్ని ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయన్న రవిశాస్త్రి
  • కింగ్ కాంగ్ అని పిలిస్తే బాగుంటుందని సూచన
  • టీ20 ప్రపంచకప్ ఆడే భారత జట్టుకు మెంటార్‌గా ధోనీ
టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్‌ ధోనీని ’కింగ్ కాంగ్ అని పిలిస్తే బాగుంటుందని భారత జట్టు కోచ్ రవిశాస్త్రి అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోనీ సాధించిన దానికి సమీపంలో కూడా ఎవరూ లేరని రవిశాస్త్రి కితాబునిచ్చాడు. అతనితో ఎవరినీ పోల్చలేమని స్పష్టం చేశాడు.

ఐసీసీ టోర్నీల్లో ధోనీ రికార్డులను ఒకసారి పరిశీలించాలని చెప్పిన రవిశాస్త్రి.. అతని ఖాతాలో ఏం లేవని ప్రశ్నించాడు. ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్, ఐసీసీ టోర్నమెంట్లు, రెండు ప్రపంచకప్‌లు ఇవన్నీ ధోనీ సాధించినవే అని చెప్పాడు. ధోనీ ఏ జట్టుకైనా సారధ్యం వహిస్తుంటే ఆ జట్టు మొత్తం మారిపోతుందని, ఆటగాళ్లలో ప్రశాంతత, నియంత్రణ పెరుగుతాయని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.

ప్రత్యర్థి జట్టు భారీ షాట్లతో విరుచుకుపడుతున్నా, ధోనీ జట్టులో ఒక భరోసా, అన్నీ నియంత్రణలో ఉన్నాయన్న ప్రశాంతత కనిపిస్తాయని వివరించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోనీ కంటే గొప్ప కెప్టెన్ మరొకరు లేరని కితాబునిచ్చాడు. ఈ క్రమంలోనే ధోనీని ’కింగ్ కాంగ్' అని పిలవాలని సూచించాడు. కాగా, ఈ నెల 17 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో భారత జట్టుకు మెంటార్‌గా ధోనీని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.


More Telugu News