నా ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించండి.. కోర్టును కోరిన ట్రంప్

  • జనవరి 6న యూఎస్ కాపిటల్ పై దాడి తర్వాత బ్యాన్ 
  • నిబంధనలు ఉల్లంఘించారని ప్రకటించిన ట్విట్టర్ 
  • ఫ్లోరిడా కోర్టులో ట్రంప్ పిటిషన్ వేసినట్లు వార్తలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలాకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే ఈ ఏడాది ఆరంభంలో ఆయన ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలు  బ్యాన్ అయ్యాయి. అధ్యక్ష ఎన్నికల తర్వాత ఫలితాలను ట్రంప్ అంగీకరించ లేదు.  ఎన్నికల్లో మోసం జరిగిందని ఆరోపించారు.

ఈ క్రమంలో ఆయన అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. యూఎస్ కాపిటల్ పై దాడి చేశారు. ఈ క్రమంలో హింసను ప్రేరేపించేలా కామెంట్లు చేశారని పేర్కొంటూ ట్విట్టర్, ఫేస్ బుక్ రెండు సంస్థలూ ట్రంప్ ఖాతాలను బ్యాన్ చేశాయి. అయితే ప్రత్యర్ధుల ప్రేరణతోనే తన ఖాతాలు బ్యాన్ చేశారని ట్రంప్ ఆరోపించారు.

ఇప్పుడు ఇదే విషయాన్ని చెబుతూ ఫ్లోరిడాలోని కోర్టులో కేసు వేశారని తెలుస్తోంది. తన ఖాతాలను పునరుద్ధరించేలా ఫేస్ బుక్, ట్విట్టర్ సంస్థలను ఆదేశించాలని ట్రంప్ కోరారని సమాచారం. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ట్రంప్ తన ఖాతాలు బ్యాన్ అయినప్పటి నుంచి ప్రజలకు ఏం చెప్పాలన్నా కష్టంగా ఉందని ఫీల్ అవుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ట్రంప్ ఇలా కోర్టుకెక్కినట్లు వచ్చిన వార్తలపై స్పందించడానికి ట్విట్టర్ నిరాకరించింది.


More Telugu News