అమిత్ షాకు అదానీ శిష్యుడు కావడం వల్లే జగన్ భయపడుతున్నారు: సీపీఐ నారాయణ

  • డ్రగ్స్ వ్యవహారంలో ఏపీ, కేంద్రం కూడా భాగస్వాములే
  • తెలుగు రాష్ట్రాల్లోని ప్రజా ప్రతినిధుల భాష ‘బిగ్‌బాస్’లో కంటే దారుణం
  • యువ నేతలు మా పార్టీ నుంచి వెళ్లిపోతుండడంపై ఆత్మపరిశీలన అవసరం
గుజరాత్‌లోని ముంద్రా రేవులో ఇటీవల పట్టుబడిన మాదక ద్రవ్యాలతో ఏపీకి సంబంధాలున్నట్టు వార్తలు రావడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న ఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఏపీ, కేంద్రం కూడా భాగస్వాములేనని ఆరోపించారు.

మాదక ద్రవ్యాల దందా, ఇతర సమస్యలపై ఢిల్లీలో జరిగే సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. ముంద్రా పోర్టు నుంచి విజయవాడకు మాదక ద్రవ్యాలు వచ్చినప్పటికీ అదానీని జగన్ ప్రశ్నించలేకపోతున్నారని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అదానీ శిష్యుడు కావడం వల్లే జగన్ భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ఉద్దేశపూర్వకంగానే అమ్మేస్తున్నారని, అందులో భాగంగానే గంగవరం పోర్టు అదానీ పరమైందని అన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధుల భాష రియాలిటీ షో బిగ్‌బాస్‌లో కంటే దారుణంగా ఉందన్నారు. ఏపీలో ఇది మరింత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నయ్య కుమార్ లాంటి యువ నేతలు తమ పార్టీ నుంచి  బయటకు వెళ్లిపోతున్న విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉందని నారాయణ అన్నారు.


More Telugu News