యువప్లేయర్‌పై సునీల్ గవాస్కర్ ప్రశంసలు.. టీమిండియాకు కావాల్సిన ఆటగాడని కితాబు!

  • అతనిలాంటి ఆల్‌రౌండర్ భారతజట్టుకు కావాలని కితాబు 
  • హార్దిక్ పాండ్యా ఫామ్ కోల్పోవడంతో అయ్యర్‌పై ఫోకస్ 
  • నాలుగు మ్యాచుల్లో 126 పరుగులు, 2 వికెట్లు తీసిన అయ్యర్
యువప్లేయర్ వెంకటేశ్ అయ్యర్‌పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అద్భుతంగా రాణిస్తున్న ఆటగాళ్లలో అయ్యర్ ఒకడు. ఇప్పటి వరకూ కేవలం నాలుగే మ్యాచులు ఆడినప్పటికీ అందరి దృష్టినీ ఆకర్షించాడీ ఆల్‌రౌండర్.

నాలుగు మ్యాచుల్లో కలిపి 126 పరుగులు చేయడమే కాకుండా, 2 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇటీవల ప్రకటించిన టీ20 ప్రపంచకప్ జట్టులో ఉన్న హార్దిక్ పాండ్యా ఫామ్‌లేమితో ఇబ్బందులు పడుతుండటంతో అయ్యర్‌పై మరింత ఫోకస్ పెరిగిందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అయ్యర్ వంటి ఆల్‌రౌండర్ ప్రస్తుతం టీమిండియాకు అవసరం ఉన్నాడని చెప్పాడు.

 "వెంకటేశ్ అయ్యర్‌ వంటి ఆటగాడి కోసం భారత జట్టు ఎదురు చూస్తోంది. యార్కర్లు అద్భుతంగా వేసి, బ్యాట్స్‌మెన్ భారీ షాట్లు ఆడకుండా అడ్డుకుంటున్నాడు. అలాగే బ్యాటింగ్‌లో చూడచక్కని షాట్లతో అలరిస్తున్నాడు" అని ఒక ప్రముఖ టీవీఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ చెప్పాడు.


More Telugu News